
కారెక్కిన కొండచిలువ
శివమొగ్గ: ఎవరికై నా కారులో దూసుకెళ్లాలని ఉంటుంది, ఓ కొండచిలువ కూడా అలాగే అనుకుంది ఏమో మరి.. కారులోకి ఎక్కేసింది. ఈ సంఘటన శివమొగ్గ నగరంలోని స్వామి వివేకానంద లేఔట్‌లోని ఎ బ్లాక్‌లో శనివారం సాయంత్రం జరిగింది. శ్వేతా బండి అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న కారులోకి సుమారు 7 అడుగుల పొడవైన కొండచిలువ రోడ్డు మీద నుంచి పాకుతూ వెళ్లింది. ఈ దృశ్యాలను చూసిన కొందరు కారు యజమానికి చెప్పడంతో ఆయన స్నేక్ కిరణ్‌కు ఫోన్ చేశారు. స్నేక్ కిరణ్ చేరుకుని ఎంతసేపు ప్రయత్నించినా కొండచిలువ బయటకు రాలేదు. చివరకు మెకానిక్‌ను పిలిపించి కొన్ని భాగాలను విప్పి దానిని బయటకు తీశారు. తరువాత దూరంగా వదిలిపెట్టారు.
గోవధ కేసులో ఇద్దరి అరెస్టు
దొడ్డబళ్లాపురం: కిరాతకంగా ఆవుల గొంతుకోసి హత్య చేసి కళేబరాలను రోడ్డుపై విసిరేసిన ఇద్దరు దుండగులను నెలమంగల గ్రామీణ పోలీసులు అరెస్టు చేసారు. ఇమ్రాన్ (30), సయ్యద్ నవాజ్ (35) అరైస్టెన నిందితులు. నెలమంగల తాలూకా అరళసంద్ర గ్రామంలో ఇటీవల రెండు ఆవులను ఇలా వధించారు. ఈ సంఘటనపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేరళకు జీవాలను తరలిస్తున్న ముఠా సభ్యులను పట్టుకుని విచారించగా నిందితులు రెండు ఆవులు మాంసానికి పనికిరావని తెలిసి కోపంతో వాటిని గొంతుకోసి హత్య చేసి కళేబరాలను విసిరేసి వెళ్లిపోయినట్టు తెలిపారు. వారి సమాచారం మేరకు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
ఉన్మాద ప్రేమికుడు ఆస్పత్రిపాలు
మైసూరు: మైనర్ బాలికను ప్రేమించాలని వెంటపడ్డాడు, ఆమె తిరస్కరించడంతో దాడి చేయబోయి, తానే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యా చేసుకున్నాడో పాగల్ ప్రేమికుడు. ఈ సంఘటన చామరాజనగరలో జరిగింది. వివరాలు.. సాణెగాలకు చెందిన ప్రదీప్ అనే యువకుడు గ్రామంలోనే ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. చామరాజనగరలో కేఎస్ ఆర్టీసీ బస్టాండు వద్ద బస్సు ఎక్కుతున్న బాలికను అతడు ప్రేమించాలని అడిగాడు, బాలిక అతనిపై మండిపడింది. దీంతో బాలిక మీద కత్తితో దాడి చేయబోగా ఆమె తప్పించుకుంది. తర్వాత తన కడుపులోనే పొడుచుకున్నాడు. కొందరు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి స్థానిక సిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్
కోలారు: తాలూకాలోని వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీ ఎన్నిక ఆదివారం శాంతియుతంగా ముగిసింది. 92.56 శాతం పోలింగ్ జరిగింది. వార్డు నెంబర్ 6లో అత్యధికంగా 98.52 శాతం ఓటింగ్ సాగింది. పట్టణ పంచాయతీలో మొత్తం 17 వార్డులు ఉండి, వివిధ పార్టీల నుంచి 51 మంది పోటీ పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి, డిప్యూటీ కలెక్టర్ మంగళ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీ అయిన తరువాత మొదటిసారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ – జేడీఎస్ మరోవైపు పోటీలో ఉన్నాయి. బుధవారం కౌంటింగ్ జరుగుతుంది.

కారెక్కిన కొండచిలువ