
హెబ్బాళ ఫ్లై ఓవర్ ర్యాంప్ నేడు షురూ
శివాజీనగర: బెంగళూరులోని హెబ్బాళ కొత్త ఫ్లై ఓవర్ ర్యాంప్ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. దీనిద్వారా హెబ్బాళలో ట్రాఫిక్ ఒత్తిడి 30 శాతం తగ్గే అవకాశముంది. ర్యాంప్‌పై రెండు రోజుల ట్రయల్ రన్ చేశారు. 700 మీటర్ల పొడవైన హెబ్బాళ ర్యాంపు సుమారు రూ.80 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కే.ఆర్.పురం వైపు నుంచి మేఖ్రీ సర్కిల్‌ను కలుపుతుంది. 2023లో పనులు ఆరంభమై ఇటీవల ముగిశాయి. నాగవార నుంచి వచ్చే వాహనాలు ర్యాంప్ మీద నుంచి వెళ్లిపోవచ్చు. దీని వల్ల మేఖ్రీ కూడలికి సులభంగా చేరుకుని అక్కడ వాహన రద్దీ రెట్టింపు అవుతుందని విమర్శలు వస్తున్నాయి.
ఇతర రోడ్లపై ఒత్తిడి
ట్రయల్ రన్ సమయంలో మేఖ్రీ కూడలిలో ట్రాఫిక్ పెరిగినట్లు గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది ఇతర రోడ్లపై ప్రభావం చూపుతోందన్నారు. మేఖ్రీ సర్కిల్ వద్ద రోడ్డును విస్తరించాలని సూచించారు. ఇందుకోసం బీబీఎంపీ ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని గుర్తించింది. రోడ్డు విస్తరణ జరిగితే ఆర్.టీ.నగర, జయమహల్, వసంతనగర వైపు వెళ్లే వాహనాలు మేఖ్రీ సర్కిల్‌లో ఫ్రీ లెఫ్ట్ తీసుకోవచ్చు. దీనిద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బాప్టిస్ట్ ఆసుపత్రి వద్ద మళ్లీ రద్దీ ఇబ్బంది కలుగుతుంది. ఆసుపత్రి వద్ద ఉన్న బస్టాప్‌లను మార్చే అవకాశముంది. అయితే రెండు వారాల పాటు ట్రాఫిక్‌ని గమనించిన తరువాత నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
అక్కడ ట్రాఫిక్ రద్దీ తగ్గి.. మేఖ్రీ
కూడలిలో ఇబ్బంది!