
పసిడి స్మగ్లింగ్ కేసులో రన్యరావుకు బెయిలు
బనశంకరి: సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో అరైస్టెన నటి రన్య రావు కు బెంగళూరు ప్రత్యేక కోర్టు మంగళవారం బెయిల్‌ను మంజూరు చేసింది. మార్చి 3వ తేదీన బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు రన్య రావును సోదాలు చేయగా 14.8 కేజీల బంగారం లభించడంతో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తీసుకొస్తూ ఆమె పట్టుబడింది. కేసు నమోదు చేసి కొన్నిరోజుల పాటు తీవ్రంగా ప్రశ్నించారు. తరువాత పరప్పన అగ్రహార జైలుకు రిమాండు తరలించారు. పలుమార్లు ఆమె బెయిలు పిటిషన్లు దాఖలు చేయగా, ఎట్టకేలకు లభించింది. ఆమెతో పాటు అరెస్టయిన తరుణ్ రాజుకు ఇంకా బెయిలు దొరకలేదు.
ఐశ్వర్య బెయిలు అర్జీ వాయిదా
బెంగళూరులో బంగారు షాపుల నుంచి భారీ మొత్తంలో నగలు కొట్టేసిన కేసులో అరైస్టెన ఐశ్వర్య గౌడ బెయిల్ పిటీషన్ విచారణను హైకోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నిస్తూ ఐశ్వర్య వేసిన పిటిషన్ ను మంగళవారం హైకోర్టు విచారించింది. అరెస్ట్‌కు సరైన కారణం చూపలేదని ఆమె వకీలు వాదించారు. ఈడీ న్యాయవాది వాదనలకు సమయం కోరడంతో వాయిదా వేశారు.