175 బిలియన్‌ డాలర్లతో ట్రంప్‌ ‘గోల్డెన్‌ డోమ్‌’.. చైనా, రష్యా ఆందోళన.. | Donald Trump Golden Dome Missile Shield System Protect USA | Sakshi
Sakshi News home page

Golden Dome: 175 బిలియన్‌ డాలర్లతో ట్రంప్‌ ‘గోల్డెన్‌ డోమ్‌’.. చైనా, రష్యా ఆందోళన..

May 21 2025 9:41 AM | Updated on May 21 2025 10:26 AM

Donald Trump Golden Dome Missile Shield System Protect USA

వాషింగ్టన్‌: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్‌.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్‌ డోమ్‌’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్‌ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.

వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్‌ డోమ్‌’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్‌ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.

యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణం జరుగుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్‌ నిర్మాణానికి 175 బిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్‌ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్‌ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్‌లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

చైనా, రష్యా ఆందోళన..
ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్‌అవీవ్‌ ఈ డోమ్‌ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్‌ డోమ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement