ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది? | Pak air chief in US after Chinese equipment | Sakshi
Sakshi News home page

ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది?

Jul 3 2025 6:33 PM | Updated on Jul 3 2025 7:16 PM

Pak air chief in US after Chinese equipment

పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌షరీఫ్‌తో ఆ దేశ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌(ఫైల్‌ఫోటో)

అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో డిన్నర్‌ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు.  మరి ఇప్పుడు పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు.  పాక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. 

ఇక్కడ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్‌ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. 

 భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌సింధూర్‌ తర్వాత పాక్‌ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్‌కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్‌లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్‌ కొట్టిన దెబ్బతో పాక్‌ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్‌ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం  ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. 

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో  పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌(ఫైల్‌ఫోటో)

చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?
పాక్‌కు భారత్‌ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్‌, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్‌. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్‌ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్‌ ఆర్మీనే పదే పదే యూఎస్‌కు ట్రంప్‌ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.  ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్‌ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్‌ ప్రధానిని పక‍్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో  ఎవరికీ అర్థం కావడం లేదు.

పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలు
ఇటీవల సమకూరిన నిధులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్‌.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్‌ కొనుగోలుకు ఇప్పటికే పాక్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.  

ఇక్కడ పాక్‌కు అమెరికా ఎంత సపోర్ట్‌గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్‌తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్‌ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్‌ డిన్నర్‌ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. 

ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?
ఇక చైనా కూడా పాక్‌కు అండగానే ఉంటుంది.  ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాక్‌కే సపోర్ట్‌ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది.  ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్‌ మ్యాన్‌కు అర్థం అవుతున్న విషయం. 

విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్‌.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్‌కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్‌లో పాక్‌ ఆర్మీ అధికారుల దర్శనం​ ఏమిటి?, అమెరికా-పాక్‌ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement