
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించే వారం దగ్గరపడింది. ఈ సోమవారం అంటే అక్టోబరు 6 నుంచి అక్టోబరు 13 వరకు విజేతల ప్రకటన ప్రక్రియ కొనసాగనుంది. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, సాహిత్యం,రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించేవారిని నోబెల్ బహుమతులతో సత్కరించనున్నారు.
జ్యూరీ అనుసరించే విధానం
నోబెల్ బహుమతుల ఎంపిక ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అవార్డుల విజేతలను జ్యూరీ అత్యంత రహస్యంగా ఎంపిక చేస్తుంది. గోప్యత అనేది విజేతల ఎంపికలో తప్పనిసరి విధానం. ఇది నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. నామినీలు, నామినేటర్ల గుర్తింపులను గత 50 ఏళ్లగా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి విధానం బాహ్య ఒత్తిళ్లు, ఊహాగానాలను నివారిస్తుంది. అవార్డుల గొప్పతనాన్ని కాపాడుతూ, విజేతలు ఎవరనే ఉత్కంఠను కొనసాగిస్తుంది. ప్రముఖ ప్రొఫెసర్లు, మునుపటి అవార్డు గ్రహీతలు, ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, శాంతి పరిశోధన సంస్థల డైరెక్టర్లు.. నోబెల్ బహుమతులకు అర్హులైవారిని నామినేట్ చేస్తారు.
స్వీయ నామినేషన్లకు అవకాశం ఉండదు.
శాంతి బహుమతి విభాగంలో..
నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి వర్గానికి లేదా విభాగానికి చెందిన నిపుణుల కమిటీలు నామినేషన్లను సమీక్షిస్తాయి. ఈ కమిటీలు నివేదికలను సిద్ధం చేస్తాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్న బహుమతి ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉన్నారా? లేదా అనే దానిపై చర్చలు జరుగుతాయి. నోబెల్ శాంతి బహుమతి విభాగంలో నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ’ ఎంపికకు సారధ్యం వహిస్తుంది. వారు తమకు అందిన నామినీల నుండి ఒక షార్ట్‌లిస్ట్‌ను తయారు చేస్తారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటారు. తుది నిర్ణయాన్ని సాధారణంగా ఏకాభిప్రాయం మేరకు తీసుకుంటారు. అక్టోబర్‌లో అధికారిక ప్రకటనకు ముందు ఈ తతంగమంతా జరుగుతుంది.
ఎంపిక ప్రక్రియలో వీటికి తావుండదు
సాహిత్యంలో నోబెల్ బహుమతి విషయానికొస్తే స్వీడిష్ అకాడమీ సభ్యులు నామినేటెడ్ అభ్యర్థులను రచనలను రహస్యంగా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యుల మెజారిటీ మద్దతును అందుకున్నవారే తుది అర్హత సాధిస్తారు. గోప్యతా నియమం అన్ని బహుమతి విభాగాలకు వర్తిస్తుంది. లాబీయింగ్, మీడియా హైప్, రాజకీయ జోక్యం మొదలైనవాటికి ఎంపిక ప్రక్రియలో తావుండదు. కఠినమైన గోప్యత, నిపుణుల నిర్ణయం, మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకే నోబెల్ బహుమతులకు అత్యంత అర్హులైనవారిని ఎంపిక చేస్తారు.