
గాజా: గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు.
నరకం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలతో..
దీనిలోని నిబంధనల ప్రకారం హమాస్ తన ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆయుధాలను విడిచిపెట్టి, పరిపాలన నుంచి తప్పుకోవాలని ప్రధానంగా ట్రంప్ సూచించారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే అంగీకారం తెలిపారు. కాగా ఈ ప్రణాళికను అంగీకరించని పక్షంలో నరకం తప్పదని ట్రంప్ ఇప్పటికే హమాస్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హమాస్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిబంధనలకు తలొగ్గింది. బందీల విడుదల విషయంలో మధ్యవర్తులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదేవిధంగా గాజా పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రణాళికలోని పలు అంశాలపై పాలస్తీనా వర్గాలతో సంప్రదింపులు అవసరమని తెలిపింది.
President Donald J. Trump shares a powerful message in response to Hamas' statement regarding his peace plan:
"Very importantly, I look forward to having the hostages come home." pic.twitter.com/RZArVNcXc9— The White House (@WhiteHouse) October 3, 2025
ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలు
మరోవైపు ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్, అరబ్ తదితర ముస్లిం దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. బందీల విడుదలకు హమాస్ మొగ్గు చూపడం శాంతి దిశగా పడిన కీలక అడుగుగా అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై తుది ఒప్పందం కుదిరి, గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. హమాస్ నిర్ణయం దరిమిలా గాజాపై బాంబు దాడులను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ఇంతలో ట్రంప్ ప్రణాళిక మొదటి దశను తక్షణ అమలు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.
శాశ్వత శాంతికి హమాస్ సిద్ధం?
గాజాలో శాంతిని సాధించగల ఏకైక వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్న ట్రంప్ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు మద్దతు పలికారు. అలాగే హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి. తద్వారా బందీలను సురక్షితంగా, త్వరగా బయటకు తీసుకురావచ్చు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా నెతన్యాహు కార్యాలయం ‘ఇజ్రాయెల్.. నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా, ఉందని, ఇది అధ్యక్షుడు ట్రంప్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది’ అని తెలిపింది.