
సింగపూర్: సింగపూర్‌లో ఇద్దరు సెక్స్ వర్కర్లను దోచుకుని, వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు యువకులకు సింగపూర్ కోర్టు ఐదేళ్ల ఒక జైలుతో పాటు 12 బెత్తం దెబ్బలను శిక్షగా విధించింది. ఆరోక్కియసామి డైసన్(23) రాజేంద్రన్ మైలరసన్(27)లు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించారని ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తన కథనంలో తెలిపింది.
ఆరోక్కియసామి, రాజేంద్రన్ ఏప్రిల్ 24న భారత్ నుండి సింగపూర్‌కు వచ్చారు. రెండు రోజుల తర్వాత వీరు లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి వారితో ‘లైంగిక సేవల కోసం వేశ్యలు కావాలా? అని అడుగుతూ, ఇద్దరు మహిళల సమాచారాన్ని అందించాడు. అయితే ఆరోక్కియ తన స్నేహితుడు రాజేంద్రన్‌తో..మనకు డబ్బు చాలా అవసరమని, ఆ మహిళలను హోటల్ గదిలో దోచుకోవాలని సూచించాడు. దీనికి రాజేంద్రన్ అంగీకరించాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఒక హోటల్ గదిలో ఒక మహిళను కలవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు.
వారిద్దరూ గదిలోకి వెళ్లి, ఆ మహిళ చేతులు, కాళ్లను కట్టేసి దాడి చేశారు. ఆమె దగ్గరున్న నగలు, నగదు, పాస్‌పోర్ట్, బ్యాంక్ కార్డులను దోచుకున్నారు. తరువాత అదే రోజు రాత్రి 11 గంటలకు వారిద్దరూ మరొక హోటల్‌లో ఇంకో మహిళను కలుసుకున్నారు. ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు రాజేంద్రన్ ఆమె నోటిని మూశాడు. తరువాత ఆమె దగ్గరున్న నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఆమె పాస్‌పోర్ట్‌ను దొంగిలించారు. తాము తిరిగి వచ్చే వరకు గది నుండి బయటకు వెళ్లవద్దని ఆమెను హెచ్చరించారు. కాగా బాధిత మహిళల ఫిర్యాదుతో విషయం కోర్టు వరకూ చేరింది.
ఈ ఘటనపై జడ్జి తీర్పునిస్తున్న సమయంలో నిందితులు ఆరోక్కియసామి, రాజేంద్రన్ తేలికైన శిక్ష కోసం వేడుకున్నారు.‘మా నాన్న గత ఏడాది మరణించారు. నాకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. వారిలో ఒకరికి వివాహం అయింది. మా దగ్గర డబ్బు లేదు. అందుకే మేము ఇలా చేశాం’ అని ఒక అనువాదకుని సాయంతో ఆరోక్కియసామి జడ్జి ముందు పేర్కొన్నాడు. ‘నా భార్య, బిడ్డ భారతదేశంలో ఒంటరిగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు’ అని రాజేంద్రన్ జడ్జి ముందు మొరపెట్టుకున్నాడు. కాగా దోపిడీకి పాల్పడి, గాయపరిచిన నేరానికి ఐదు నుండి 20 ఏళ్ల జైలు శిక్ష,కనీసం 12 బెత్తం దెబ్బలు విధించే అవకాశాలుంటాయని సింగపూర్ దినపత్రిక ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ పేర్కొంది.