
భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్ బైజాన్‌లపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లోనే భారీ ఎత్తున బుకింగ్స్ రద్దయినట్లు నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే పర్యాటకులు తరలివెళ్తారు. ఈ సంవత్సరం కూడా సుమారు లక్ష మందికి పైగా పర్యాటకులు తుర్కియే, అజర్‌బైజాన్‌ల సందర్శనకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు అంచనా.
తుర్కియే, అజర్‌బైజాన్ దేశాల్లో అందమైన పర్యాటక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది కుటుంబాలతో సహా టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగానే ఈ రెండు దేశాల పర్యటనలను రద్దు చేసుకోవడం విశేషం. మరోవైపు ట్రావెల్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం తుర్కియే, అజర్‌బైజాన్‌ల బుకింగ్‌లను రద్దు చేయాలని అన్ని ప్రాంతాలకు చెందిన టూర్ ఆపరేటర్లకు సర్క్యూలర్‌ను విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన టూర్ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చే బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు నగరానికి చెందిన వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపారు. రెండు, మూడు రోజులుగా నగరం నుంచి సుమారు 10 వేల మందికిపైగా పర్యాటకులు తమ టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
ఆ రెండు దేశాలకే ఎందుకు..
సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, మలేíÙయా, శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొంతకాలంగా తుర్కియే, అజర్‌బైజాన్‌లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్ టూర్లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆకట్టుకొనే అందమైన పార్కులు ఉన్నాయి. తుర్కియేలో కేవలం సినిమా షూటింగ్‌లకే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే చారిత్రక ఇస్తాంబుల్ నగరం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది.
ఇక్కడ ఉన్న బ్లూ రివర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. హగీష్ సోఫియా చారిత్రక మ్యూజియం కూడా పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. పురాతన కట్టడాలు, కోటలు, గొప్ప ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన భవనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అజర్‌బైజాన్‌లోని పాతనగరం బాకు మరో ప్రముఖ పర్యాటక కేంద్రం. వందల సంవత్సరాల నాటి చారిత్రక, సాంస్కృతిక విశేషాలకు ఇది నిలయం. హైదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్, జొరాస్ట్రియన్ల చారిత్రక ఫైర్ టెంపుల్ వంటివి ఆకట్టుకొనే ప్రదేశాలు.
షాపింగ్ సెంటర్..
మినీ చైనాగా పేరొందిన తుర్కియో నుంచి పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్బుల్స్, ఫర్నీచర్, యాపిల్స్ దిగుమతి ఎక్కువగా ఉంది. అలాగే ఈ దేశానికి వెళ్లిన పర్యాటకులు కూడా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా షాపింగ్ సెంటర్లు ఉన్నాయి.
ఇస్తాంబుల్‌లోని గ్రాండ్ బజార్ అతి పెద్ద స్ట్రీట్ మార్కెట్. సుమారు 4 వేలకుపైగా షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. దుస్తులు, ఆభరణాలు, టర్కి, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ లభిస్తాయి. అలాగే అంకారాలోని అంకామాల్, కెనెరాలోని ఆస్కార్‌బజార్ వంటి మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఉందిగా.. ప్రత్యామ్నాయం..
తుర్కియే, అజర్‌బైజాన్ టూర్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్న పర్యాటకులు ప్రత్యామ్నాయంగా వియత్నాం, దుబాయ్, మలేసియా, బ్యాంకాక్, ఇండోనేషియా తదితర దేశాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ‘ఆ రెండు దేశాల బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న వారు ఎక్కువ మంది వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు.’ కూకట్‌పల్లికి చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు.