
న్యూఢిల్లీ: రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ కీలకపాత్ర పోషించాయి. వీటి పనితీరు అద్భుతంగా ఉన్నట్లు తేలింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్‌ను సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. రష్యా అధ్యక్షుడు ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు.
ఈ సందర్భంగా ఎస్–400ల కొనుగోలు గురించి పుతిన్‌తో మోదీ చర్చించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు ఎస్–400ల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు. ఇందులో మూడు ఎస్–400లను భారత్‌కు రష్యా అప్పగించింది. మిగిలిన రెండు త్వరలో రానున్నాయి. ఇవి కాకుండా అదనపు వ్యవస్థల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధమైంది.