
ట్రంప్‌కు పాకిస్తాన్ వినతి
చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో పాస్నీ పోర్టు
ఇస్లామాబాద్: అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో భారీ ఓడరేవు(పోర్టు) నిర్మించి, నిర్వహించాలని తాజాగా ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. బలూచిస్తాన్‌లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది.
ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు సమీపంలోనే పాస్నీ టౌన్ ఉండడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. పాస్నీలో ఓడరేవు కోసం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పట్టణం ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉంది.
వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇప్పటికే రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం పాస్నీ పోర్టులో అమెరికా ప్రభుత్వం ఒక టర్మినల్ నిర్మించి, నిర్వహించనుంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలను ఇక్కడి నుంచే అమెరికాకు చేరవేస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ గత నెలలో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. పాకిస్తాన్‌లో మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు పెట్టాలని ఈ సందర్భంగా అమెరికా కంపెనీలను ఆహ్వానించారు.
పాకిస్తాన్‌లో ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి ట్రంప్‌కు అసిమ్ మునీర్ ప్రత్యేకంగా వివరించారు. చెక్క పెట్టెలో తీసుకొచ్చిన కొన్ని నమూనాలు కూడా చూపించారు. రక్షణ, సాంకేతిక అవసరాల కోసం పాకిస్తాన్‌తో కలిసి ఖనిజాలను గుర్తించి, వెలికితీయడం కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా మెటల్స్ కంపెనీ ముందుకొచ్చింది.
పాస్నీలోని పోర్టు నిర్మాణం కోసం అమెరికాను పాక్ సర్కార్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాస్నీ పోర్టు నుంచి ఖనిజ సంపద ఉన్న పశ్చిమ ప్రావిన్స్‌ల దాకా రైలు మార్గాన్ని అమెరికా నిధులతో నిర్మించాలన్నదే పాక్ ఉద్దేశం. ఈ ప్రాంతం ఇరాన్‌కు, దక్షిణాసియాకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. ఇక్కడ పాగా వస్తే అరేబియా సముద్రంతోపాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రాబల్యం విస్తరిస్తుంది.
అమెరికాకు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే, సైనిక అవసరాల కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. గ్వాదర్‌లో చైనా ఇప్పటికే ఒక పోర్టును పాక్ సాయంతో నిర్వహిస్తోంది. గ్వాదర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో పాస్నీ ఉంది. ఇక్కడ ఓడ రేవు నిర్మించాలంటూ చైనా ప్రత్యర్థి దేశమైన అమెరికాను పాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్‌కు కీలకం. పాకిస్తాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్‌లు ఒప్పందంపై సంతకాలు చేశాయి.