దశాబ్దాల సరిహద్దు వైరం.. దేవాలయంపై దాడి.. పదవి కోల్పోయిన ప్రధాని.. | One Lakh Thai Civilians Evacuated Amid Second Day Of Thailand-Cambodia Border Clashes, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Thailand-Cambodia: దశాబ్దాల సరిహద్దు వైరం.. దేవాలయంపై దాడితో ఉద్రిక్తత

Jul 25 2025 9:14 AM | Updated on Jul 25 2025 10:34 AM

one lakh People displaced Thailand-Cambodia Border Issue

కాంబోడియా: థాయ్‌ల్యాండ్‌, కంబోడియా స‌రిహ‌ద్దుల్లో ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 14 మంది పౌరులు మృతి చెందగా.. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.

థాయ్‌ల్యాండ్‌, కంబోడియా దళాల మధ్య గురువారం ఘర్షణలు తీవ్రమయ్యాయి. రెండు దేశాల సైనికులు సరిహద్దుల్లో ఫైరింగ్ జ‌రిపారు. ప్రాచీన ఆల‌యం టా మోన్ థామ్ వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. థాయ్‌ల్యాండ్‌లోని సురిన్ ప్రావిన్సులో ఈ ఆల‌యం ఉన్న‌ది. బోర్డ‌ర్ ఫైరింగ్‌తో రెండు దేశాల్లో ఉద్రిక్త‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. తాజా ఘటనపై థాయిలాండ్ ఆరోగ్య మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. సురిన్ ప్రావిన్స్‌లో ఒక ప్రధాన ఆసుపత్రిపై షెల్లింగ్ దాడి జరిగిందని, ఈ దాడిని యుద్ధ నేరంగా పరిగణించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, గ‌త కొన్ని రోజులుగా బోర్డ‌ర్ వ‌ద్ద ఇలాంటి ప‌రిస్థితి ఉన్న‌ది. అసలు ఈ సరిహద్దు వివాదంతోనే గతంలో థాయ్‌ ప్రధాని ఏకంగా పదవిని కోల్పోయారు.

ల్యాండ్‌మైన్ల వివాదం..
ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య మందుపాతరల అంశం  కీలకంగా మారింది. వివాదాస్పద ప్రదేశాల్లో ల్యాండ్‌మైన్లు పేలడంతో థాయ్‌ల్యాండ్‌ సైనికులు గాయపడ్డారు. జూలై 16వ తేదీన పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న సైనికుడు.. ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో కాలు కోల్పోయిన‌ట్లు థాయ్ అధికారులు తెలిపారు. థాయ్‌ ఇది తమ ప్రదేశంలో జరిగిందని చెబుతుండగా.. కంబోడియా మాత్రం ప్రీహ్‌ విహార్‌ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకొందని వాదిస్తోంది. వారం క్రితం కూడా వివాదాస్పద స్థలాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకొన్నాయి. పినోమ్‌ పెన్‌ సేనలు రష్యా నుంచి కొనుగోలు చేసిన మైన్లను ఇటీవలే ఇక్కడి భూమిలో పాతినట్లు బ్యాంకాక్‌ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను కంబోడియా ఖండించింది. థాయ్‌ సేనలే ఒప్పందంలోని గస్తీ మార్గాలను ఉల్లంఘిస్తున్నాయని చెబుతోంది. తాజాగా సరిహద్దు వివాదం ముదరడంతో థాయ్‌ వాయుసేనకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగి ట మోన్‌ థోమ్‌ ఆలయ ప్రదేశంలో బాంబింగ్‌ చేశాయి. ఇక క్షేత్ర స్థాయిలో కంబోడియా సేనలు ప్రతి దాడులు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి.

సరిహద్దు వివాదం ఇలా.. 
ఫ్రెంచ్ కాలంలో 1907లో రూపొందించిన సరిహద్దు మ్యాప్‌లు ఆధారంగా ఇరు దేశాల మధ్య 817 కి.మీల సరిహద్దు ఉంది. ఇరు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ.. సరిహద్దులు మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్‌ విహార్‌, ట మోన్‌ థోమ్‌, ట మ్యూన్‌ థోమ్‌ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం ఈ పోరాటం జరుగుతోంది. డాంగ్రెక్‌ పర్వతాల శిఖరం థాయ్‌ల్యాండ్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానిని థాయ్‌ల్యాండ్‌ అంగీకరించింది. కానీ, ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి.

కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయ్‌ల్యాండ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక, కొన్నేళ్ల ముందు ఐసీజే మరో తీర్పు ఇచ్చి అగ్గి రాజేసింది. ప్రీహ్‌ విహార్‌ పరిసరాల్లో కంబోడియా సార్వభౌమత్వం ఉందని.. థాయ్‌ దళాలు వైదొలగాలని కోరింది. దీనికి బ్యాంకాక్‌ అంగీకరించినా.. మ్యాప్‌లు, మిలిటరీ గస్తీలపై వివాదం మొదలైంది. ఇక తమ దేశ పరిధిలోని సురిన్‌ ప్రావిన్స్‌లోని ట మోన్‌ థోమ్‌, ట మ్యూన్‌ థోమ్‌ ప్రాంతాలు కూడ ఇరు దేశాల వివాదాస్పద ప్రదేశాలుగా మారిపోయాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు మృతి చెందాడు. పినోమ్‌ పెన్‌లో ఇది జాతీయవాద సెంటిమెంట్‌ను రగిల్చింది. 

పదవి కోల్పోయిన ప్రధాని.. 
అధికారం చేపట్టిన పది నెలలకే థాయ్‌లాండ్‌ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు పదవీగండం ఈ వివాదం నుంచే వచ్చింది. కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్‌తో ఫోన్‌కాల్‌లో మాట్లాడింది. అంకుల్‌ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్‌ ఆర్మీ కమాండర్‌ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్‌కాల్‌ సంభాషణ లీకైంది. దీంతో సొంత పక్షం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్‌ భూమ్‌జాయ్‌థాయ్‌ పార్టీ విడిపోయింది. షినవత్రా పదవిని కోల్పోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement