
థాయ్‌లాండ్–కాంబోడియా మధ్య ఉద్రిక్తతలు
థాయ్‌లాండ్‌లో 12 మంది మృతి
దిగజారిన దౌత్య సంబంధాలు
బ్యాంకాక్: థాయ్‌లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్‌లాండ్ వైమానిక దాడులను సైతం ప్రారంభించింది. ఈ ఘటనల్లో 12 మంది చనిపోయారు.
వీరిలో 11 మంది పౌరులు కాగా, ఒక సైనికుడు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచాయచై తెలిపారు. మరో నలుగురు సైనికులు 25 మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కాంబోడియా విడుదల చేయలేదు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ తెలిపింది.
ఏం జరిగిందంటే..
ప్రాచీన ‘ట మ్యుయెన్ థోమ్’ఆలయం సమీపంలోనే గురువారం ఉదయం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదటగా మొదలైంది. ఘర్షణకు కారణం మీరంటే మీరేనని ఎవరికి వారు ఆరోపణలు సంధించుకుంటున్నారు. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని, ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది. ఆస్పత్రిపైనా కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది. అందుకే, తాము సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు అనంతరం ప్రకటించింది.
తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మ రక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, థాయ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్‌ను పంపించిందని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది. పురాతన ప్రియా విహియార్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది. థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపర్చాలని కాంబోడియా ప్రధాని హున్ మనెత్ ఐరాసకు తాజాగా లేఖ రాశారు.
పేలిన మందుపాతర
బుధవారం వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి థాయ్‌లాండ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతోపాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్‌లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది.
ప్రతిగా కాంబోడియా సైతం థాయ్‌తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. బ్యాంకాక్‌లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది. థాయ్‌లాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఉబోన్ రట్చంథని ప్రావిన్స్‌లో బుధవారం మందుపాతర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం తెలపగా తమ ప్రియా విహియార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుందని కాంబోడియా అంటోంది.
వెయ్యేళ్ల ఆలయమే కేంద్రంగా
భారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్‌లాండ్, కాంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖ్మెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయా ల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్‌తా మ్యుయెన్ థోమ్ అనే శివాల యా న్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్యవర్మన్–2 అనే రాజు నిర్మించాడు. దాంగ్‌రెక్ పర్వతాల్లో పురాతన ఖ్మెర్ హైవేను కాంబోడి యాలోని అంగ్‌కోర్‌ను థాయ్‌లాండ్‌లోని ఫిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖ్మెర్ సామాజ్య సరిహద్దులపై తమకే హక్కుందని కాంబోడియా అంటుండగా, థాయ్‌లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి.
ఫ్రాన్స్ ఇచ్చిన మ్యాప్‌తో వివాదం
థాయ్‌లాండ్‌లోని సురిన్ ప్రావిన్స్, కాంబోడియా లోని ఒద్దార్ మియాంచే ప్రావిన్స్‌ల పొడవునా ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన శివాలయం ‘టమ్యుయెన్ థోమ్’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. థాయ్‌లాండ్, కాంబోడియాలు గతంలో ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. ఆ సమయంలో 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్‌ను రూపొందించింది.
ఈ మ్యాప్‌లో పేర్కొన్న భూ భాగం తమదేనని కాంబోడియా అంటుండగా, థాయ్‌లాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. దీనిపై కాంబోడియా అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పటి నుంచీ తరచూ చోటుచేసుకుంటున్న సైనిక ఘర్షణల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాంబోడియా 2011లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం 2013లో మరోసారి కాంబోడియాకే ఆ దేవాలయ ప్రాంతంపై హక్కుందంటూ మరోసారి ప్రకటించింది. థాయ్‌లాండ్ మాత్రం ఈ తీర్పును అంగీకరించడంలేదు.