
నేడు మలేసియాలో చర్చలు
బ్యాంకాక్: థాయ్‌లాండ్, కాంబోడియాల మధ్య సరిహద్దు వివాదంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. థాయ్, కాంబోడియా నేతలు సోమవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో సమావేశమవనున్నారు. ఈ విషయాన్ని థాయ్ ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం తెలిపింది.
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు జరిగే ఈ చర్చల్లో థాయ్ తరఫున తాత్కాలిక ప్రధాని ఫుంతమ్ వెచయాచై పాల్గొంటారని పేర్కొంది. కాంబోడియా ప్రధాని హున్ మనెట్ కూడా చర్చలకు హాజరవుతారని తెలిపింది. అయితే, కాంబోడియా అధికారికంగా స్పందించలేదు. ఆసియాన్ చైర్మన్ స్థానంలో ఉన్న మలేసియా ప్రధాని ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించారని పేర్కొంది.
ట్రంప్..ఆసియాన్ జోక్యం
ఘర్షణలను ఆపేయాలంటూ ఆ రెండు దేశాల నేతలను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించడం తెల్సిందే. ఒక ఒప్పందానికి రాకుంటే రెండు దేశాలతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోమంటూ హెచ్చరించడంతో ఇద్దరు ప్రధానులు దిగివచ్చారని ట్రంప్ చెప్పుకున్నారు. బేషరతు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌కు చెప్పినట్లు కాంబోడియా ప్రధాని హున్ మనెట్ తెలిపారు. థాయ్ ప్రధాని సైతం ఇందుకు సిద్ధమయ్యారని ట్రంప్ తనకు చెప్పారన్నారు. ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో, థాయ్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపే బాధ్యతను తమ డిప్యూటీ ప్రధాని ప్రాక్ సొఖొన్‌కు అప్పగించానన్నారు. అయితే, కాంబోడియా నిజాయితీతో చర్చలకు ముందడుగు వేస్తేనే తామూ కలిసి వస్తామని థాయ్ అంటోంది.
34కు చేరిన మరణాలు
వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో గురువారం మందుపాతర పేలి థాయ్ సైనికులు గాయపడటంతో వివాదం తీవ్రరూపం దాల్చడం తెల్సిందే. శాంతి నెలకొల్పేందుకు ఒక వైపు దౌత్యపరమైన ప్రయత్నాలు సాగుతుండగా, ఆదివారం కూడా రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగాయి. పౌర ప్రాంతాలపైకి కాల్పులు జరిపారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నాలుగు రోజుల ఘర్షణల్లో ఇప్పటి వరకు 34 మంది చనిపోగా 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.