
ఆసియా దేశాలు థాయ్-కంబోడియా తాజా సరిహద్దు ఘర్షణలకు ఎట్టకేలకు ముగింపు పడింది. ఇరు దేశాలు ఎలాంటి షరతులు లేకుండా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన మలేషియా ప్రధాని అన్వర్ అబ్రహీం సోమవారం ప్రకటించారు.
ఈ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. అయితే.. ఈ ఏడాది మే చివరి వారంలో కంబోడియన్ సైనికుడి కాల్చివేత ఘటన నుంచి 817 కిలోమీటర్ల సరిహద్దు వెంట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల పరస్పర ఆరోపలతో దాడులను మొదలై.. తీవ్రతరం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో..
గత నాలుగైదు రోజుల ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. దీంతో యుద్ధం ఆపేందుకు థాయ్-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని జులై 26వ తేదీన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో..
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు పుత్రజయ(మలేషియాలో)లోని ఇబ్రహీం నివాసంలో సోమవారం థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్, కంబోడియా ప్రధాని హున్‌మానెట్ సమావేశయ్యారు. ఈ భేటీకి చైనా, అమెరికా రాయబారులు కూడా హాజరయ్యారు.
భేటీ తర్వాత మలేషియా ప్రధాని అన్వర్ ఇరు దేశ ప్రధానుల చేతులను చేతిలో ఉంచి సంధి కుదిర్చినట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదన మేరకు ఇరు దేశాల ప్రధానులం కాల్పుల విరమణకు అంగీకరించాం అని కంబోడియా ప్రధాని హున్‌మానెట్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే సోమవారం చర్చల సమయంలోనూ ఇరు దేశాల సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగినట్లు సమాచారం.

ఇరుదేశాల ఘర్షణలు దేనికంటే..
ప్రాచీన హిందూ దేవాలయాలు అయిన తా మోయాన్ థామ్, 11వ శతాబ్దపు ప్రేహ్ విహార్ ఆలయాలు ఇరు దేశాల సరిహద్దు వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రేహ్ విహార్ ఆలయాన్ని కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయితే.. థాయ్‌లాండ్ ఆ తీర్పును ఖండిస్తూ ఇచ్చింది. 2008లో UNESCO వారసత్వ ప్రదేశంగా నమోదు చేయాలన్న ప్రయత్నం తర్వాత ఇరు దేశాల ఉద్రిక్తతలు పెరిగాయి.
2025 మే నెల చివర్లో నుంచి సరిహద్దు వివాదం ముదరసాగింది. ఈ క్రమంలో ప్రైవేట్‌గా సంధి కోసం ప్రయత్నించిన పేటోంగ్టార్న్ షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌కి ఫోన్ కాల్ చేసి ‘అంకుల్’ అంటూ మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ బయటకు రావడంతో.. అనూహ్యంగా ఆమె పదవి నుంచి వైదొలగాల్సి(సస్పెండ్) వచ్చింది. ఈ తరుణంలో.. జూన్‌లో కంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని వివాద పరిష్కారానికి కోరింది. థాయ్‌లాండ్ మాత్రం న్యాయస్థాన అధికారాన్ని అంగీకరించలేదు, ద్వైపాక్షిక చర్చలే సరైన మార్గమని పేర్కొంది.