ఒకవైపు అమెరికన్ టెక్ నిపుణుల వేతనాల వృద్ధి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంటే, మరోవైపు భారతీయ టెక్ ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ సాంకేతిక రంగంలో ఈ విచిత్రమైన వైరుధ్యం ఏర్పడడానికి కారణాలను కొన్ని సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఒకే పరిశ్రమలో, ఒకే రకమైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు రెండు భిన్నమైన వేతన ధోరణులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ పేరోల్ అండ్ కంప్లయన్స్ ప్లాట్‌ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్‌మెంట్ సంస్థ కార్టా (Carta) సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ఈ విశ్లేషణకు దారితీసిన ప్రధాన కారణాలను, ముఖ్యంగా అమెరికాలో వేతనాలు పెరగడానికి, భారత్‌లో వేతన పరిహారం తగ్గడానికి గల అంశాలను పరిశీలిద్దాం.
భారత్‌లో వేతన పరిహారం తగ్గుదలకు కారణాలు
భారతీయ టెక్ నిపుణుల వేతనాలు 2025లో భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్, డేటా సంబంధిత ఉద్యోగుల సగటు పరిహారం 40% తగ్గి 22,000 డాలర్లకు(సుమారు రూ.19.5 లక్షలు) చేరుకుంది. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం కూడా 23,000కు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు కింది విధంగా ఉన్నాయి.
వేతన పెంపులో ఒత్తిడి
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సంప్రదాయ వేతన పెరుగుదల ఆశించినంత ఉండడంలేదు. కంపెనీలు ప్రస్తుతం ఈక్విటీ-హెవీ పరిహార నమూనాల (Equity-heavy compensation models) వైపు మొగ్గు చూపుతున్నాయి. టెక్ పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల మొత్తం పరిహారాన్ని పెంచడానికి ఈక్విటీ-ఆధారిత వేతనం (Equity-based pay) ఒక సాధనంగా మారుతోంది. కొన్ని కంపెనీల్లో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల స్థూల వేతనం తగ్గినా ఈక్విటీ గ్రాంట్లు పెరగడం దీనికి సంకేతం.
అధిక టాలెంట్ సప్లై
భారతదేశంలో టెక్ గ్రాడ్యుయేట్లు, నైపుణ్యం కలిగిన ఇంజినీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిమాండ్‌ను మించి సప్లై ఎక్కువగా ఉన్నప్పుడు వేతనాలపై సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా తక్కువ వేతనాలతో నాణ్యమైన టాలెంట్‌ను పొందడానికి భారత్ వంటి మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి.
అమెరికాలో వేతనాల పెంపునకు కారణాలు
భారత్‌లో వేతనాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ యూఎస్ టెక్ ఉద్యోగుల సగటు జీతాలు 1,22,000 డాలర్ల నుంచి 1,50,000కు పెరిగాయి. ప్రొడక్షన్, డిజైన్ నిపుణుల సగటు వేతనం 1,38,000 వద్ద ఉంది. ఈ పెరుగుదలకు దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.
అధిక డిమాండ్
యూఎస్ మార్కెట్‌లో అత్యాధునిక సాంకేతిక రంగాల్లో(AI, మెషిన్ లెర్నింగ్ వంటివి) అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ ఉంది. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీలు అధిక జీతాలను, ఆకర్షణీయమైన పరిహారాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నాయి.
ఈక్విటీ-ఆధారిత పరిహారం
నివేదిక ప్రకారం, ఈక్విటీ ఆధారిత వేతనం ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ప్రతిభను ఆకర్షిస్తోంది. యూఎస్‌లోని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యంలో వాటాను (ఈక్విటీ) పెద్ద మొత్తంలో అందిస్తున్నాయి. దీని వల్ల మొత్తం పరిహారం (జీతం + ఈక్విటీ) గణనీయంగా పెరుగుతోంది.
ద్రవ్యోల్బణం, జీవన వ్యయం
అమెరికాలో అధిక జీవన వ్యయం, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు తమ ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి వేతనాలను పెంచడం అనివార్యమవుతోంది.
ఇదీ చదవండి: తీర ప్రాంత వాణిజ్యం, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంతంటే..


