న్యూయార్క్ మేయర్ (New York Mayor) పదవి పోటీల్లో ప్రధాన అభ్యర్థిగా ఉన్న భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమ్దానీ(Zohran Mamdani) చిక్కుల్లో పడ్డారు. 9/11 దాడుల తర్వాతి పరిస్థితులతో ఇక్కడి ముస్లింలు భయం భయంగా గడిపారని, ఆ రోజులు వాళ్లకు ఎన్నో పాఠాలు నేర్పాయంటూ మాట్లాడారాయన. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది.
సెప్టెంబర్ 11 తర్వాత న్యూయార్క్‌లో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆ దాడుల తర్వాత ఇక్కడి ముస్లింలు భయంతో మరియు అవమానంతో జీవించాల్సి వచ్చింది. ఎంతలా అంటే.. నా మేనత్త సబ్‌వేలలో(అండర్‌గ్రౌండ్ మెట్రో) ప్రయాణించడమే మానేశారు. బహిరంగంగా హిజాబ్‌తో ఉండడం సురక్షితం కాదనే ఆమె ఆ పని చేశారు. కేవలం ఆమెకు మాత్రమే కాదు.. ఈ పరిస్థితులు ఎంతో మంది ముస్లింలకు ఆనాడు పాఠాలు నేర్పించాయి అని భావోద్వేగంగా మమ్దానీ మాట్లాడారు. అయితే..
మమ్దానీ ప్రసంగంపై నెట్టింట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. కొందరు మమ్దానీ వంశవృక్షాన్ని తవ్వి మూలాలను బయటకు తీశారు. మమ్దానీకి ఉంది ఒకే ఒక మేనత్త అని, ఆమె పేరు మసమ మమ్దానీ అని, ఆమె టాంజానియాలో జీవిస్తోందని, 2001 ఉగ్రదాడుల సమయంలోనూ ఆమె అక్కడే ఉందని పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ఫొటోను సైతం రిలీజ్ చేసి.. కట్టుకథ అల్లాడంటూ జోహ్రాన్ మమ్దానీపై మండిపడుతున్నారు.
తీవ్ర విమర్శల వేళ జోహ్రాన్ మమ్దానీ మరోసారి స్పందించారు. ఆమె తన తండ్రి తరఫు చుట్టమని(సోదరి), చాలా ఏళ్ల కిందటే మరణించారని.. ఆ అనుభవం ఎదురైంది ఆమెకేనని వివరణ ఇచ్చాడు. అయితే.. మమ్దానీ వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. ఈసారి 9/11 బాధితుల కుటుంబాలు రంగంలోకి దిగాయి. మమ్దానీ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం స్పందిస్తూ.. ట్విన్ టవర్స్ దాడుల బాధితురాలు జోహ్రాన్ మేనత్త కూడా అంటూ ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ నేత ఆండ్రూ కుఓమో ఓ అడుగు ముందుకేసి మమ్దానీ జిహాద్ మద్దతుదారుడని, అందుకే 9/11 రోజున సంబురాలు చేసుకుంటాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
ఇదీ చదవండి: మూన్‌లైటింగ్.. డాలర్లలకు కక్కుర్తిపడితే కష్టమే!


