
థాయ్‌లాండ్–కాంబోడియా పరస్పర ఆరోపణలు
33కు చేరిన మరణాల సంఖ్య.. నిరాశ్రయులైన 1.68 లక్షల మంది
కాల్పుల విరమణకు ఒత్తిళ్లు
సురిన్(థాయ్‌లాండ్): థాయ్‌లాండ్, కాంబోడియా ల మధ్య సరిహద్దుల్లో ప్రారంభమైన ఘర్షణలు శనివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. కాల్పుల ఘటనల్లో ఇరు పక్షాలకు చెందిన కనీసం 33 మంది చనిపోగా, 1.68 లక్షల మధ్య నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణకు రావాలంటూ ఇరుదేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.
సరిహద్దు వివాదాస్పద ప్రాంతంలో గురువారం మందుపాతర పేలి ఐదుగురు థాయ్ సైనికులు చనిపోవడం ఘర్షణలకు ఆజ్యం పోసింది. శనివారం ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇరు పక్షాలు రాకెట్లు, శతఘ్నులతో కాల్పులకు దిగాయి. ఎఫ్–16 యుద్ధ విమానాలను, డ్రోన్లను దాడులకు వినియోగించినట్లు థాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇరు దేశాలు తమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. థాయ్‌లాండ్ ఈశాన్య ప్రాంతంలోని కాంబోడియా సరిహద్దును మూసివేసింది.
మీరంటే మీరే..
సరిహద్దుల్లోని తమ పుర్సత్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలపైకి థాయ్ సైన్యం శనివారం ఉదయం శతఘ్ని కాల్పులకు దిగిందని కాంబోడియా రక్షణ శాఖ తెలిపింది. అదేవిధంగా, తమ కోహ్ కాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాల్లోకి థాయ్ నేవీ పడవలు ప్రవేశించాయంది. ఆ దేశం రెచ్చగొట్టేలా దురాక్రమణ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.
థాయ్ కాల్పుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఏడుగురు పౌరులు కాగా నలుగురు సైనికులు ఉన్నారంది. కాంబోడియాలోని పౌర నివాసాలను తాము లక్ష్యంగా చేసుకున్నామంటూ చేస్తున్న ఆరోపణలను థాయ్ ప్రభుత్వం ఖండించింది. కాంబోడియా ఆర్మీ పౌరులను రక్షణ కవచాలుగా వాడుకుంటూ నివాస ప్రాంతాల్లో ఆయుధాలను మోహరిస్తోందని ఆరోపించింది. ట్రాట్ ప్రావిన్స్‌లోకి ప్రవేశించేందుకు కాంబోడియా ఆర్మీ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టామంది.
ఆసియాన్ చొరవను కోరిన మండలి
థాయ్‌లాండ్ – కాంబోడియా ఉద్రిక్తతలపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు, ముఖ్యంగా చిన్నారులకు హాని తలపెట్టేలా వ్యవహరించవద్దని కోరింది. సరిహద్దులు సమీపంలోని 852స్కూళ్లతోపాటు ఏడు ఆస్పత్రులను థాయ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మూసివేసిందని తెలిపింది. శనివారం మరో 12 మంది చనిపోయినట్లు కాంబోడియా తెలిపింది.
దీంతో, ఆ దేశంలో మరణాల సంఖ్య 13కు చేరుకుంది. థాయ్‌లాండ్ సైతం మరణాల సంఖ్య 20కి చేరినట్లు ప్రకటించింది. వీరిలో అత్యధికులు పౌరులేనని పేర్కొంది. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐరాస భద్రతా మండలి రెండు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటూ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఆసియాన్‌ను కోరుతూ తీర్మానం చేసింది.
ఆసియాన్ అధ్యక్ష స్థానంలో ఉన్న మలేసియా దీనిపై స్పందించింది. రెండు దేశాలతో చర్చలు జరిపి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యతను రక్షణ మంత్రికి అప్పగించినట్లు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న 800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల విషయంలో దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి.
పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ
థాయ్‌లాండ్‌తో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో కాంబోడియాకు వచ్చే భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని నాంఫెన్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ముఖ్యంగా కాంబోడియా సరిహద్దు ప్రాంతాల వైపు రావద్దని కోరింది. ఈ మేరకు శనివారం అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర సాయం కావాల్సిన వారు +855 92881676 నంబర్‌కు లేక cons.phnompenh@mea. gov.in. మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరింది. ఇదే విషయమై శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేయడం తెల్సిందే.