థాయ్‌-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ | Thailand Cambodia Row: Advisory to Indians is This Details | Sakshi
Sakshi News home page

థాయ్‌-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ

Jul 25 2025 1:33 PM | Updated on Jul 25 2025 3:02 PM

Thailand Cambodia Row: Advisory to Indians is This Details

థాయ్‌లాండ్‌, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.

భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్‌ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్‌, సురిన్‌, సిసాకెట్‌, బురిరామ్‌, సా కవావో, ఛంథాబురి, ఉవోన్‌ రట్చథాని..ప్రావిన్స్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్‌లాండ్‌ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్‌ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్‌లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.

Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్‌లాండ్‌ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. 

మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్‌ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్‌ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్‌ సేన్‌తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్‌’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్‌కాల్‌ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్‌ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్‌ వెచయాచై థాయ్‌ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.

జూలై 23, 2025న ల్యాండ్‌మైన్ పేలడంతో థాయ్‌లాండ్‌కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్‌లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.

గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్‌లాండ్‌ కంబోడియన్‌ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement