పాక్ పీచమణచేందుకు ముహూర్తం ఖరారు!
న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: సర్వం సిద్ధమవుతోంది. ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు.12వ రోజూ కాల్పులుమరోవైపు పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు వరుసగా 12వ రోజూ కొనసాగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ కశ్మీర్లో 8 సెక్టా్టర్లలో పాక్ సైన్యం సోమవారం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కవ్వింపుల చర్యలకు దీటుగా బదులిచ్చినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతి చర్యల్లో భాగంగా సింధూ జల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఏప్రిల్ 24న కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఆ వెంటనే నియంత్రణ రేఖ వద్ద పాక్ సైన్యం ఆగడాలు మొదలయ్యాయి.భేటీలతో బిజీబిజీగా మోదీదేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు.యుద్ధం వద్దు: ఐరాసజనాక్రోశాన్ని అర్థం చేసుకోగలనుదాడులు పరిష్కారం కాదు: గుటెరస్ఐరాస: భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వెలిబుచ్చింది. వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకూ సూచించారు. అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని తెలిపారు. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు. సాయుధ ఘర్షణ మొదలైతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్‌లో పెల్లుబుకుతున్న జనాగ్రహాన్ని, ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. ఆ పాశవిక దాడిని మరోసారి ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలా పౌరులను లక్ష్యం చేసుకోవడం దారుణం. దీనికి పాల్పడ్డవారికి చట్టపరంగా కఠిన శిక్షపడాల్సిందే’’ అన్నారు.అణుయుద్ధం దిశగా పరిస్థితులు: పాక్కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి తమపై భారత్ ఏ క్షణమైనా సైనిక దాడి చేయవచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు తమకు నివేదికలున్నట్టు చెప్పుకొచ్చారు. అదే జరిగితే దీటుగా బదులిస్తామన్నారు. మరోసారి ‘అణు’ పల్లవి వినిపించారు. మోదీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాసియాను అణుయుద్ధం వైపు నెడుతున్నారని ఆక్షేపించారు. పాక్‌లోని ఖైబర్ ఫక్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో భారత్ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి, తమపై భారత్ పాల్పడుతున్న ఆర్థిక ఉగ్రవాదానికి 2016, 2017ల్లోనే ఐరాసకు అన్ని ఆధారాలూ సమర్పించామని ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి కూడా భారత్ పనే. మా ప్రధాని షహబాజ్ షరీఫ్ సూచించినట్టు అంతర్జాతీయ దర్యాప్తు జరిగితే ఆ దాడి మోదీ సర్కారు పనా, లేక భారత్‌లోని ఏదైనా సంస్థ పనా అన్నది తేలిపోయేది’’ అంటూ అతి తెలివి ప్రదర్శించారు.పాక్ పార్లమెంటు భేటీపాక్ పార్లమెంటు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పహల్గాం దాడికి తమను నిందించడాన్ని తీవ్రంగా ఖండించింది. సింధూ జల ఒప్పందం నిలిపివేతను యుద్ధ చర్యగా పేర్కొంది. భారత ప్రతీకార చర్యలను నిరసించింది. కశ్మీరీల స్వయంప్రతిపత్తి పోరుకు మద్దతిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు తీర్మానాలు చేసింది.