ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.
బంగ్లాదేశ్ వివాదాస్పద నిర్ణయం
వివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకర్త జకీర్ నాయక్‌పై భారతదేశంలో మనీలాండరింగ్‌తో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదేవిధంగా జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశం లేదని ప్రకటించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత తన నిర్ణయం మార్చుకోవడం వివాదాస్పదంగా మారింది. 2016, జూలైలో రాజధాని ఢాకాలోని ‘హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్’ పై దాడి వెనుక జకీర్ నాయక్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు.. జకీర్ నాయక్ బోధనలతో ప్రేరణ పొందారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి ప్రభుత్వం జకీర్ నాయక్‌ను బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించకుండా నిషేధించింది.
2016లో జకీర్ నాయక్‌పై ఎన్‌ఐఏ కేసు
భారతదేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అతనిపై ఉగ్రవాదం, మనీలాండరింగ్ తదితర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. ఢాకాలో ఉగ్రవాద దాడి తర్వాత అతను ఆ దేశం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్ స్పార్క్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వహించే ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నవంబర్ 28-29 తేదీలలో బంగ్లాదేశ్‌కు రానున్నారు. ఈ కార్యక్రమం ఢాకాలోని అగర్గావ్ ప్రాంతంలో జరగనుంది. వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో 2016లో ఎన్‌ఐఏ తొలిసారిగా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జకీర్ నాయక్‌పై కేసు నమోదు చేసింది.
జకీర్ అప్పగింతకు మలేషియా సహకారం?
60 ఏళ్ల జకీర్ నాయక్ 2016లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లి, అక్కడ శాశ్వత నివాస హోదాను పొందాడు.తనపై సాగుతున్నఅన్యాయమైన విచారణ నుండి సురక్షితంగా బయటపడేవరకూ తాను భారతదేశానికి తిరిగి రానని జకీర్ నాయక్ గతంలో వెల్లడించారు. కాగా తమ దేశంలో సమస్యలు సృష్టించనంత వరకు జకీర్ నాయక్‌ను బహిష్కరించలేమని, భారత్‌కు పంపే ప్రసక్తే లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఏడాది మొదట్లో భారతదేశంలోని మలేషియా హైకమిషనర్ దాతో ముజాఫర్ షా ముస్తఫా మాట్లాడుతూ జకీర్ నాయక్ అప్పగింతకు సంబంధించి భారతదేశానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్‌నర్’ హతం


