న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన గాంధీ విహార్‌లో కలకలం రేపింది. ఇక్కడి ఒక ఫ్లాట్‌లో ఉంటున్న 32 ఏళ్ల యూపీఎస్‌సీ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
కాలిపోయిన స్థితిలో..
అతని మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసులకు లభ్యమయ్యింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుని లివ్ ఇన్ పార్ట్‌నర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఫోరెన్సిక్ సైన్స్‌లో బీఎస్సీ చదువుతున్న 21 ఏళ్ల మహిళ, ఆమె మాజీ ప్రియుడు, వారి స్నేహితుడు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నివాసితులని పోలీసులు తెలిపారు. మృతునితో గతంలో సహజీవనం చేసిన ఒక యువతి తన ఇద్దరు పురుష స్నేహితులతో కలసి తన భాగస్వామిని హత్య చేసింది. ఆ తరువాత దానిని ప్రమాదవశాత్తూ జరిగినదిగా చూపించేందుకు అతని శరీరానికి నిప్పంటించారని పోలీసులు పేర్కొన్నారు.
ఏసీ పేలిందంటూ ఫోన్..
మృతుడిని రామ్‌కేష్ మీనాగా పోలీసులు గుర్తించారు. అతను గాంధీ విహార్‌లోని ఒక భవనంలోని నాల్గవ అంతస్తులో నివసిస్తున్నాడని తెలిపారు. అక్టోబర్ 6న, ఏసీ పేలుడు కారణంగా అతని ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసి, గది నుండి తీవ్రంగా కాలిపోయిన ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే అక్టోబర్ 5- 6 తేదీల మధ్యరాత్రిలో ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఫ్లాట్‌లోకి ప్రవేశించారని, తెల్లవారుజామున 2.57 గంటల ప్రాంతంలో, ఒక మహిళతో పాటు వారంతా బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. వారు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.
అశ్లీల వీడియోలే కారణం?
దర్యాప్తు సమయంలో నేరం జరిగిన ప్రదేశానికి సమీపంలో మహిళ ఉన్నట్లు చూపించే కాల్ వివరాల రికార్డులు పోలీసులలో అనుమానాన్ని రేకెత్తించాయి. మొరాదాబాద్‌లో అక్టోబర్ 18న ఆమెను అరెస్టు చేశారు. ఆమె నేరాన్ని అంగీకరించడంతో పాటు తనకు సహకరించిన ఇద్దరు సహచరుల పేర్లను వెల్లడించిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా మృతుడు రామ్‌కేష్ మీనా తన అశ్లీల వీడియోలను రికార్డ్ చేశాడని, అయితే వాటిని తొలగించడానికి నిరాకరించాడని ఆ యువతి పోలీసుల విచారణలో తెలిపింది. అందుకే ఆమె రామ్‌కేష్ మీనా చంపాలని నిర్ణయించుకున్నదని పోలీసులు తెలిపారు.
ఎల్‌పీజీ పంపిణీదారు సహకారంతో..
నిందితులు ముగ్గురూ తొలుత రామ్‌కేష్ మీనా గొంతు కోసి హత్య చేశారు. తరువాత అతని శరీరంపై నూనె, నెయ్యి మద్యం పోశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎల్‌పీజీ పంపిణీదారుగా పనిచేసే ఆ యువతి మాజీ ప్రియుడు గ్యాస్ సిలిండర్ వాల్వ్ తెరిచి నిప్పంటించాడు. దీంతో పేలుడు సంభవించింది. ఆ తర్వాత వారు రామ్‌కేష్ మీనాకు సంబంధించిన కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లు, ఇతర వస్తువులు తీసుకుని పారిపోయారు. కాగా నిందితుల నుండి పోలీసులు హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, మృతుని షర్టు, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: ‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు


