‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు | Rahul Gandhi reacts to Maharashtra doctor case | Sakshi
Sakshi News home page

‘ఇది సంస్థాగత హత్య’.. ‘మహారాష్ట్ర’ ఘటనపై రాహుల్ విమర్శలు

Oct 26 2025 12:54 PM | Updated on Oct 26 2025 1:37 PM

Rahul Gandhi reacts to Maharashtra doctor case

సతారా: మహారాష్ట్రలోని సతారాలో  వైద్యురాలి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దీనిని ‘సంస్థాగత’ హత్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన దరిమిలా న్యాయం కోసం పోరాడుతున్న బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని ఆయన ప్రకటించారు. 

ఈ ఘటనకు సంబంధించి వెలువడిన కొన్ని నివేదికలను గుర్తుచేస్తూ, రాహుల్‌ గాంధీ ‘బీజేపీతో సంబంధం  కలిగిన కొందరు ప్రముఖులు.. బాధిత వైద్యురాలిని అవినీతి ఊబిలోనికి నెట్టేందుకు ప్రయత్నించారని  ఆరోపించారు. ఈ ఘటన నాగరిక సమాజపు మనస్సాక్షిని కదిలించే విషాదమని ఆయన అన్నారు. తన వైద్యంతో ఇతరుల  రోగాలను తగ్గించాలని ఆశపడిన వైద్యురాలు.. అవినీతి వ్యవస్థలో కూరుకుపోయిన నేరస్థుల వేధింపులకు గురయ్యిందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తుల నుండి ప్రజలను రక్షించే బాధ్యత కలిగిన అధికారులే.. అమాయక మహిళపై అత్యంత దారుణానికి పాల్పడ్డారని రాహుల్‌ పేర్కొన్నారు.
 

ఇది ఆత్మహత్య కాదు.. ఒక సంస్థాగత హత్య అంటూ రాహుల్‌ తన ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. అధికారం నేరస్థులకు కవచంగా మారినప్పుడు, ఎవరి నుండి న్యాయం ఆశించగలం? డాక్టర్ మరణం.. బీజేపీ  ప్రభుత్వ అమానవీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నది. న్యాయం కోసం చేస్తున్న ఈ పోరాటంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం. భారతదేశంలోని ప్రతి  ఆడబిడ్డ భయపడనవసరం లేదు. వారికి అండగా ఉంటూ, వారి తరపున మేము న్యాయం పోరాటం చేస్తాం అని  రాహుల్‌ పేర్కొన్నారు.

గురువారం రాత్రి సతారాలోని ఒక హోటల్ గదిలో ఒక మహిళా డాక్టర్ ఉరి వేసుకున్నారు. ఆమె స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. ఫల్తాన్ సిటీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బదానే తనపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడని, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ వేధింపులకు గురి చేశాడని ఆమె సూసైడ్‌ లేఖలో రాశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు​న్నారు.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఆ రైల్వే స్టేషన్‌ పేరు మారింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement