సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. వీళ్లను ఏమాత్రం తక్కువ చేయడానికి వీల్లేదు. మన దేశంలో 35 నుంచి 45 లక్షల మంది ద్వారా గత ఏడాది కాలంలో రూ.3,500 కోట్ల వ్యాపారం జరిగిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే.. ఇలా అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెక్ పెట్టేందుకు మన పొరుగు దేశం చైనా ఓ అద్భుతమైన ప్రణాళిక అమలు చేయబోతోంది.
ఏదో ఒక వీడియోతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోవడం ఈరోజుల్లో సర్వసాధారణంగా మారింది. అలా భారత్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు.. ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇదే అదనుగా తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లను కంపెనీలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి.
భారత్‌తో పాటు పలు దేశాల్లో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో ఇప్పుడు వాళ్లదే కీలక పాత్ర. పైగా సెలబ్రిటీలకి బదులు తక్కువ బడ్జెట్‌తో ఆ పని చేస్తుండడం కంపెనీలకు కలిసొస్తోంది. ఫ్యాషన్, ఫిట్‌నెస్, ఫుడ్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో విస్తృతంగా కంటెంట్ రూపొందిస్తున్నారు. ఉదాహరణకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న ఓ వ్యక్తి ఓ కంపెనీ పరుపులను అదే పనిగా ప్రమోట్ చేయడం!. అయితే ఏఐ జమానాలో.. ప్రజలను తప్పుదోవ పట్టించే కంటెంట్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది.
అందుకే చైనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి ప్రొఫెషనల్ విషయాలపై మాట్లాడాలంటే ఇన్‌ఫ్లుయెన్సర్లకు అర్హతలు తప్పనిసరి చేసింది. వైద్యం, ఆర్థికం, న్యాయం, విద్య వంటి సున్నితమైన రంగాల్లో కంటెంట్ రూపొందించే ముందు ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ విద్యా అర్హతలు, శిక్షణ పత్రాలు లేకుంటే ప్రొఫెషనల్ అనుభవాన్ని చూపించాల్సి ఉంటుంది. అక్కడి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (ఉదాహరణకు.. Douyin, Weibo, Bilibili వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు) ఈ అర్హతలనూ ధృవీకరించాల్సి ఉంటుంది. అలా చేయకుంటే..
ఇన్‌ఫ్లుయెన్సర్ల సో.మీ. అకౌంట్లను నిలిపివేయడమే కాదు.. శాశ్వత నిషేధం విధించే అవకాశం లేకపోలేదు. అలాగే.. 100,000 యువాన్ (₹11 లక్షల వరకు) జరిమానా విధించబడుతుంది. చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ఈ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్లు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ప్రదర్శించడంపై కూడా నిషేధం.
ఇన్‌ఫ్లుయెన్సర్ల వ్యక్తిగత అకౌంట్లు మాత్రమే కాదు.. వాళ్లు నిర్వహించే మల్టీ-చానల్ నెట్‌వర్క్ (MCN)లకు కూడా ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఈ సంస్థలు తమ టాలెంట్‌ను రాజకీయంగా, ప్రొఫెషనల్‌గా సమర్థవంతంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. అదే సమయంలో..
కంపెనీ బ్రాండ్లు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కంపెనీలు లేదంటే సో.మీ. ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను స్పష్టంగా లేబుల్ చేయాలి. ఈ లేబుల్స్‌ను తొలగించడం లేదంటే తారుమారు చేయడం కఠినమైన నేరంగా పరిగణిస్తారు. లేబులింగ్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధిస్తారు.
భారత్‌లో ఇలా..
భారత్‌లో చైనా తరహా కఠిన నిబంధనలు (అర్హతల ధృవీకరణ, ప్లాట్‌ఫారమ్‌లపై బాధ్యత, భారీ జరిమానాలు) అమల్లో లేవు. కానీ.. స్పాన్సర్డ్ కంటెంట్‌కి డిస్క్లోజర్ తప్పనిసరిగా ఉంది. అంటే.. ఏఎస్‌సీఐ (Advertising Standards Council of India) ప్రకారం, #ad, #sponsored వంటి ట్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే, ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పాటు బ్రాండ్ కూడా Consumer Protection Act (CCPA) ప్రకారం బాధ్యత వహించాలి. ఈ ఏడాదిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ గవర్నెన్స్ కౌన్సిల్ (IIGC).. నైతిక ప్రమాణాలు, కంటెంట్ నైతికత, వినియోగదారుల హక్కులు వంటి అంశాలపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అయితే..
ఏఐ ఆధారిత కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌సహా ఇతర దేశాలు కూడా చైనా విధించిన నిబంధనలను పరిశీలించే అవకాశం ఉంది. స్వేచ్ఛా భావప్రకటనకు ఇది అడ్డంకిగా మారుతుందన్న విమర్శలు ఉన్నప్పటికీ, ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ఇది అవసరమన్న వాదనలు కూడా ఉన్నాయి.


