డంకీ మార్గంలో అమెరికాలోకి చొరబడేందుకు
యత్నించి దొరికిపోయిన భారతీయులు
సంకెళ్లు వేసి మరీ విమానంలో తిప్పి పంపిన ట్రంప్ సర్కార్
అంబాలా/కురుక్షేత్ర: ఏజెంట్లకు 30–40 లక్షల రూపాయలు ముట్టజెప్పి చిట్టడడవులు, నదులు దాటుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించి అక్రమ మార్గం(డంకీ రూట్)లో అమెరికాలోకి చొరబడిన పలువురు భారతీయులను అమెరికా ప్రభుత్వం బహిష్కరించి తిరిగి స్వదేశానికి పంపేసింది. దాదాపు 50 మంది భారతీయ అక్రమ వలసదారులతో అమెరికా వాయుసేనకు చెందిన సీ–17 విమానం శనివారం అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు భారత్‌కు చేరుకుంది.
తిరిగొచ్చిన వారిలో హరియాణా రాష్ట్రంలోని ఖైథాల్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా, యమునానగర్, జింద్, పానిపట్ జిల్లాలకు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. తిరిగొచి్చన వారిలో ఎక్కువ మంది 25 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లే ఉన్నారు. విదేశంలోనైనా సంపాదించి భారత్‌లోని తమ కుటుంబసభ్యులకు మెరుగైన జీవితం అందివ్వాలన్న తమ అమెరికా కల కలగానే మారిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.
‘‘అమెరికా వెళ్లేందుకు రూ.35 లక్షలు ఖర్చు చేశా. ఆ డబ్బంతా భారత్‌లో వ్యవసాయం చేసి సంపాదించా. ఎలాగోలా ఫ్లోరిడా సమీపంలోని జాక్సన్‌విల్లేలో పనిలో కుదిరా. వంట నేర్చుకున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం నన్ను అరెస్ట్‌చేసి వెనక్కి పంపేసింది. నా కుటుంబ బంగారు భవిష్యత్తు నాశనమైంది. నా డబ్బంతా వృథా అయింది. విమానంలో చేతులకు బేడీలు, కాళ్లకు ఇనుప గొలుసులు కట్టేశారు. 24 గంటలపాటు అలాగే తీసుకొచ్చారు. దీంతో నా కాళ్లు ఇలా పూర్తిగా ఉబ్బిపోయాయి ’’అని 45 ఏళ్ల అక్రమ వలసదారుడు హర్జీందర్ సింగ్ వాపోయారు.
‘‘కెనడాలో ఉండేవాడిని. తర్వాత రెండేళ్ల క్రితం వర్క్ పరి్మట్‌తో అమెరికాకు వెళ్లా. అక్కడ ఒక దుకాణంలో పనిచేస్తుంటే అరెస్ట్‌చేసి భారత్‌కు పంపేశారు’’అని కల్సీ గ్రామవాసి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఎకరం పొలం అమ్మి, సోదరుడు, బంధువుల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.57 లక్షలు ఏజెంట్‌కు ఇచ్చా. డంకీ రూట్‌లో అమెరికా వెళ్లా. కానీ అక్కడ దొరికిపోయా.14 నెలలపాటు బంధించి ఇప్పుడు భారత్‌కు పంపేశారు’’అని నరేశ్ కుమార్ చెప్పారు. గతంలో హరియాణా, పంజాబ్, గుజరాత్‌లకు చెందిన పలువురు అక్రమ వలసదారులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్‌చేసి భారత్‌కు సాగనంపడం తెల్సిందే.


