
ప్రేమించి పెళ్లాడి.. ఎస్‌ఐ భార్య ఆత్మహత్య
● బెంగళూరులో విషాదం
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్‌బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
మొదటి భర్తకు విడాకులు ఇచ్చి..
శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్‌కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్‌ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్‌ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి.
యాత్రకు వెళ్తే, ఇల్లు ఖాళీ
మైసూరు: మైసూరులోని దొంగతనాలు ఏమాత్రం తగ్గడం లేదు. రోజూ ఒక చోరీ చొప్పున జరుగుతోంది. ఓ ఇంట్లో దొంగలు చొరబడి లక్షల విలువైన నగలు, నగదును దోచుకున్న సంఘటన తాలూకాలోని చిక్కళ్లి లో జరిగింది. మాదప్ప దంపతులు మంత్రాలయానికి దర్శనానికి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి, బీరువా, అల్మరాలలో దాచిన రూ. 7.80 లక్షల నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు నగలను కనిపించలేదు. మాదప్ప అల్మరా వద్ద తాళాలను భద్రపరిచాడని, అది తెలిసిన దొంగలు తాళాలు సేకరించి పని కానించినట్లు అనుమానాలున్నాయి.
సమాజ సేవ విస్తరించాలి
మండ్య: ప్రపంచంలో సమాజ సేవ చేసేవారి సంఖ్య పెరగాలని, సమాజ సేవ ద్వారా సామాన్య ప్రజల కన్నీటిని తుడవాలని, అప్పుడే సమాజంలో సంతోషం వెల్లివిరుస్తుందని ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి అన్నారు. మంగళవారం మండ్య జిల్లా కేఆర్ పేటెలో ఆర్‌టీఓ మల్లికార్జున చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, సేవాతత్పరులకు సన్మానం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం సంతోషకరమన్నారు. నేను, నా కుటుంబం అని కాకుండా సమాజం కోసం కూడా ఉపయోగపడాలని సూచించారు. సమాజ సేవకులకు గొప్ప ధైర్యం ఉండాలని అన్నారు.
బాల్కనీలో చదువుతూ
కింద పడి..
మైసూరు: మైసూరులోని మండి మొహల్లాలోని ఎస్‌ఆర్ రోడ్డులో అక్షత అపార్ట్‌మెంట్‌లో ఒక యువతి ఇంటి బాల్కనీ నుంచి పడి మరణించింది. మొదటి అంతస్తులో షేక్ అలీ కుటుంబం ఉంటోంది. కుమార్తె అనిక (20) మైసూరులో కళాశాలలో బిబిఏ చివరి ఏడాది చదువుతోంది. సోమవారం రాత్రి బాల్కనీలో తిరుగుతూ చదువుతోంది. మంగళవారం ఉదయం బాల్కనీ కింద యువతి మృతదేహం కనిపించింది. బాల్కనీ నుంచి పడిపోవడంతో తలకు బలమైన గాయం కావడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఓ చేత్తో పుస్తకం పట్టుకుని, మరో చేత్తో ఫోన్ చూస్తూ ఉందని, ఆ సమయంలో పట్టుతప్పి పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మండి పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేశారు.

ప్రేమించి పెళ్లాడి.. ఎస్‌ఐ భార్య ఆత్మహత్య