
బెంగళూరులో విషాదం
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్‌బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
మొదటి భర్తకు విడాకులు ఇచ్చి..
శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్‌కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్‌ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్‌ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి.