
వర్ష బీభత్సం.. అంతా అస్తవ్యస్తం
● లోతట్టు ప్రాంతాలను వీడని ముంపు
● కొనసాగుతున్న సహాయక చర్యలు
● కుదేలైన సిలికాన్ సిటీ
● మూడురోజులుగా వానలే వానలు
బనశంకరి: గత మూడు రోజులుగా బెంగళూరు నగరంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనం కడగండ్లు పడుతున్నారు. ఉప్పొంగిన డ్రైనేజీలు, మునిగిన కూడళ్లు, ఇళ్లలోకి వచ్చిన నీరు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు మళ్లీ వర్షం వచ్చింది. విరామం ఇచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాటు కురిసింది. నగరవ్యాప్తంగా పలు లేఔట్లలో ముంపు ఏర్పడింది. చెట్లు కూలిపడ్డాయి, మరో పక్క పాత కట్టడాలు కూలిపోయే భయం ఉండడంతో అందులోని నివాసులు బిక్కుబిక్కుమంటున్నారు.
పాత ఇళ్లను ఖాళీ చేయాలి
ఉదయమే వానతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో వాహనదారులు రోడ్లపై చిక్కుకుపోయారు. సిటీలో 10 కిపైగా ప్రాంతాలు ఎక్కువ జలమయమయ్యాయి. పాత కట్టడాల్లో నివసించే నివాసులు ఖాళీ చేయాలని బీబీఎంపీ అధికారులు ప్రకటించారు. అయితే ఇల్లు వదిలి ఎక్కడకు వెళ్లాలని చాలామంది ప్రశ్నించారు. పద్మనాభనగరలో ఓ భారీ చెట్టు కూలి ఇంటి మీద పడడంతో ఇల్లు ధ్వంసమైంది.
సాయిలేఔట్‌కు కటకట
● హొరమావులోని సాయిలేఔట్ పూర్తిగా జలమయం కావడంతో ఇళ్లలో చిక్కుకున్న ప్రజలను ట్రాక్టర్లు, రబ్బరు బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ పరిస్థితి తీవ్రంగా ఉంది. మోటార్ల ద్వారా నీటిని తొలగిస్తున్నారు.
● మారతహళ్లి దీపా నర్సింగ్‌హోమ్, చిన్నప్పనహళ్లి 5వ క్రాస్, పణత్తూరు రైల్వే అండర్‌పాస్, గ్రీన్‌హుడ్, ఇబ్బలూరు జంక్షన్, బాలాజీ లేఔట్, కొత్తనూరు, ఏ.నారాయణపుర కృష్ణనగర, సునీల్ లేఔట్, హరళూరు, బీఎస్‌పీలేఔట్, మహదేవపుర వలయంలోని అనేక లేఔట్లు నీటమునిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
● ఇన్‌ఫ్యాంట్రీరోడ్డు హిందూ ప్రెస్ సమీపంలో చెట్టు కూలి ట్రాఫిక్‌కు ఆటంకం ఏర్పడింది. వర్షం వల్ల సిల్క్‌బోర్డు, రూపేన అగ్రహార మధ్య హోసూరు రోడ్డు ఫ్లై ఓవర్ ను తాత్కాలికంగా మూసివేశారు. ప్రయాణికులు ఇతర మార్గాల్లో వెళ్లాలి.
● కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద చెట్టుకొమ్మ పడి మేక్రీ సర్కిల్ వరకు వాహనాలకు ఆటంకం ఏర్పడింది. కస్తూరినగర రింగ్‌రోడ్డు గ్రాండ్ సీజన్ హోటల్ వద్ద నీరు నిలిచింది.
పలు రోడ్లు బంద్
మడివాళ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అయ్యప్ప అండర్‌పాస్‌లో నీరు నిండిపోవడంతో హోసూరు మెయిన్ రోడ్డులో నగరం నుంచి రాకపోకలు దాదాపు స్తంభించాయి. హోసూరు మెయిన్‌రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు జలమయమైంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో సంచరించాలని పోలీసులు తెలిపారు. బన్నేరుఘట్టరోడ్డు ద్వారా నగరంలోకి రావచ్చు. హొసగుడ్డెదహళ్లి జంక్షన్ నుంచి మైసూరురోడ్డు టోల్‌గేట్ వర్షంనీరు నిలిచి ఉండటంతో ట్రాఫిక్ నెమ్మదించింది.
బెంగళూరు సిటీలో ఏయే రోడ్లు జలమయం
జయదేవ ఆసుపత్రి వైపు నుంచి ఈస్ట్‌ఎండ్ సర్కిల్ వరకు
వర్తూరు కాలేజీ వైపు నుంచి వర్తూరు మరవ వరకు
కాటన్‌పేటే నుంచి సుల్తాన్‌పేటే సర్కిల్ వరకు
బీలేకహళ్లి వైపునుంచి జీడీమర వరకు
సారక్కి జంక్షన్ నుంచి సింధూర జంక్షన్ వరకు

వర్ష బీభత్సం.. అంతా అస్తవ్యస్తం

వర్ష బీభత్సం.. అంతా అస్తవ్యస్తం

వర్ష బీభత్సం.. అంతా అస్తవ్యస్తం