
వాడవాడలా ముంపు గోల
ఉద్యోగుల ఇక్కట్లు
ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లలేనందున మంగళవారం పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. అయితే అలాంటి సదుపాయం లేని వేలాది ఉద్యోగులు ఉరుకుల పరుగుల మీద ఆఫీసులకు వెళ్లడం కనిపించింది. వాననీటిలో దాటడానికి పాట్లు పడ్డారు.
● నీళ్ల మధ్యలో జనం అవస్థలు
● హొరమావు సాయిలేట్, మాగడిరోడ్డు కేపీ అగ్రహారతో పాటు పలు ప్రాంతాలు జలమయం కాగా, స్థానిక నివాసుల కష్టాలు చెప్పనలవి కాదు, ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు నానా బాధలు పడుతున్నారు. బైక్‌లు, కార్లు ఎక్కడివక్కడ చిక్కుకుపోయాయి.
● అపార్టుమెంట్ల వాసులు కిందకు రాలేకపోతున్నారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అధికారులకు సాధ్యం కావడం లేదు. పై అంతస్తుల్లో ఉన్నవారు ఎలాగో నెట్టుకువస్తున్నారు.
● మామూలు ఇళ్లలో నీరు చేరగా, చేతికి దొరికింది తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తాపత్రయపడుతున్నారు. ట్రాక్టర్లు, జేసీబీల తొట్టెల్లో ప్రజలను తరలిస్తున్నారు. కానీ ఈ వాహనాలు ఏమాత్రం చాలడం లేదు. ఇక తాళం వేసిన ఇళ్లకు, షాపులకు దొంగల భయం ఏర్పడింది.
● మంగళవారం ఫైర్ సిబ్బంది, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది పంపుసెట్లు పెట్టి నీటిని తొలగించడంలో నిమగ్నమయ్యారు. కూలిన చెట్ల తొలగింపు సాగుతోంది. ముంపు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతాయని విద్యుత్ సరఫరాను బంద్ చేశారు.
● సెంట్రల్ సిల్క్ బోర్డు, మడివాళ, బొమ్మనహళ్లి ప్రదేశాల్లో పలు రోడ్లు నీటమునిగి వాహనాలు కదలడం లేదు. సంపంగిరామ నగరలో కంఠీరవ స్టేడియంలోకి నీరు చేరింది. పంపుసెట్లతో నీటిని తొలగించారు.

వాడవాడలా ముంపు గోల