
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ
సాక్షి,బళ్లారి: శబరిలోని అయ్యప్ప స్వామి ఆలయం తరహాలో బళ్లారిలో అద్భుతంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పడిపూజ, పుష్పాభిషేకం, కుంభాభిషేకంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని అనంతపురం రోడ్డులోని రాఘవేంద్ర కాలనీలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రముఖులు, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్టు అధ్యక్షుడు జయప్రకాష్ గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలోని బాల రాముడిని తయారు చేసిన విగ్రహ రూపకర్త, మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా తయారు చేసిన నవగ్రహ విగ్రహాల ప్రతిష్ట, కుంభకోణం అవార్డు విన్నర్ రామ్ కుమార్‌తో పంచలోహాలతో తయారు చేసిన దేవి విగ్రహాలను బెంగళూరుకు చెందిన వాసవీ పీఠానికి చెందిన సచ్చిదానంద సరస్వతీ చేతుల మీదుగా ప్రతిష్టాపనతో కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి శబరిమలై మూలస్థానం అర్చకులైన శ్రీరంగం శరణ్ మోహన్ పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేషమైన పుష్పాభిషేకం, 18 మెట్లకు పడిపూజ చేయడంతో పాటు అయ్యప్పస్వామి విగ్రహానికి 18 రకాలుగా పుష్పాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాలి సోమశేఖరరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పుష్ప, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ట

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప పడిపూజ