'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా.. | Offering Avakaya to guests is a proud tradition in Telugu homes | Sakshi
Sakshi News home page

'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్క రోజులోనే ఏకంగా..

May 21 2025 10:36 AM | Updated on May 21 2025 10:49 AM

Offering Avakaya to guests is a proud tradition in Telugu homes

ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్‌ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్‌కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్‌ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి 
వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్‌మెంట్‌ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు.     

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని మోతీనగర్‌ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్‌ సిటాడెల్‌ హైరైజ్డ్‌ అపార్ట్‌మెంట్‌ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్‌ గ్రూపులో పంచుకుంది. 

దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.

ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. 
దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్‌ను బుక్‌ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్‌ ఒక వేడుకగా మారింది. 

శంషాబాద్‌ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్‌ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు.  

తొలిసారి ప్రయత్నమే సక్సెస్‌ 
అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి 
మిగిల్చింది.    
 – దీప్తి ధరణిప్రగడ

మధురానుభూతి..  
కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్‌మెంట్‌లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. 
 – స్వాతి జ్యోతుల  

(చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement