
పరీక్షల్లో మీ మార్కులు బెస్ట్‌గా వచ్చే ఉంటాయి. అయితే పజిల్స్ చేయడంలో తెలుస్తుంది అసలైన చురుకుదనం. ఈ పజిల్స్‌ను స్పీడ్‌గాచేయగలరా? అసలు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా?
పిల్లలూ.. పజిల్స్ మన మెదడుకు మేత పెడతాయి. వీటికి సమయం కేటాయించడం వల్ల మీ ఏకాగ్రత, ఓర్పు పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పజిల్స్‌లో ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దామా?
పద వినోదం: దీనినే గళ్ల నుడికట్టు అని కూడా అంటారు. ఇది పదాలతో ఆడే సరదా ఆట. ఇది భాష మీద పట్టును పెంచుతుంది. దినపత్రికల్లో తెలుగు, ఇంగ్లిషుల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఖాళీ గళ్లలో పదాలు నింపే ప్రక్రియ ఇది. అందుకోసం పక్కనే మీకు కొన్ని క్లూస్ ఇస్తారు. వీటివల్ల కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి.
సుడోకు: ఇది జపాన్ దేశంలో పుట్టిన పజిల్. నిలువు తొమ్మిది, అడ్డం తొమ్మిది చొప్పున మొత్తం 81 గడులు ఉంటే సుడోకులో కొన్ని గడుల్లో అంకెలు వేసి ఉంటాయి. మిగిలిన వాటిని మనం పూర్తి చేయాలి. అయితే అడ్డంగా, నిలువుగా, తొమ్మిది గడులలో ఒకసారి వేసిన అంకె మరోసారి వేయకూడదు. సుడోకు పూర్తి చేయాలంటే చాలా ఏకాగ్రత అవసరం. పైగా సుడోకు పూర్తి చేయడం వల్ల అంకెల మీద ఇష్టం ఏర్పడుతుంది. లెక్కలంటే భయం ఉన్న పిల్లలు సుడోకు చేయడం వల్ల లెక్కల మీదున్న భయం పోతుంది.
జిగ్‌సా: ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన పజిల్ ఇది. 1760లో దీన్ని కనిపెట్టారు. ఒక అట్ట ముక్కపై ఓ ఆకారాన్ని గీసి, ఆపైన దాన్ని రకరకాలుగా ఆకృతులుగా కత్తిరిస్తారు. మనం ఆ కత్తిరించిన ముక్కల్ని కలిపి ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది ఒకరికంటే ఎక్కువమంది కూడా ఆడొచ్చు. ఆడుతున్నంతసేపూ ఏకాగ్రత చాలా అవసరం. మార్కెట్లో అనేక జిగ్‌సా పజిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కొని ఆడుకోవచ్చు.
కొత్తగా ఆలోచించు (Lateral Thinking): ఇవి మనందరికీ తెలిసిన పజిల్స్. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే ఇందులో కీలకం. ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడంలో భలే సరదాగా ఉంటుంది. పొడుపు కథలు, ప్రాచీన గాథలు, పదాలతో చేసే చిక్కుప్రశ్నలు వీటిలో కీలకం అవుతాయి.
ఈ ప్రశ్నల కోసం మార్కెట్లో ప్రత్యేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఫలానా సందర్భంలో మీరైతే ఏం చేస్తారు? ఫలానా అంశం ఇలాగే ఎందుకు జరుగుతుంది?’ అంటూ ప్రశ్నలు వేసి పిల్లల చేత సమాధానాలు రాబట్టడం ఇందులో ముఖ్యమైన విషయం.
లెక్కల పజిల్స్: ఇది మనందరికీ తెలిసినవే. లెక్కలతో తయారైన పజిల్స్. వీటిని పూర్తి చేయడం వల్ల గణితశాస్త్రంలోని పలు అంశాలపై అవగాహన పెరుగుతుంది. కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు పిల్లల చేత రాబడతారు. సరదాగా సాగుతూ పిల్లలకు లెక్కల మీద అవగాహన పెంచడం వీటిలో కీలకం.
(చదవండి: పాడ్‌కాస్ట్ చేద్దామా?)