
పిల్లలూ... ఇంతకు ముందు రేడియోలో బాలానందం అనే ప్రోగ్రామ్ ఉండేది.పిల్లల చేత ఆ ప్రోగ్రామ్‌లో మాట్లాడించేవారు. ఇప్పుడు మనమే రేడియో ప్రోగ్రామ్‌లాంటిది చేయవచ్చు. దానినే ‘పాడ్‌కాస్ట్’ అంటారు. మనకు నచ్చిన విషయాలు మాట్లాడి, రికార్డు చేసి డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద అప్‌లోడ్ చేస్తే మీ పాడ్‌కాస్ట్‌ను విని అభిమానులయ్యేవారుంటారు. ఈ సమ్మర్‌లో మీ కాలనీలోని పిల్లలతో కలిసి పాడ్‌కాస్ట్‌లు చేయండి. అందుకు ఏం చేయాలంటే....
పిల్లలూ... మీరు రేడియో వినే ఉంటారు. మామూలు రేడియో వినకపోయినా కారులోని రేడియో వినే ఉంటారు. రేడియోలో ఒకప్రోగ్రామ్ అయిపోయాక మరోసారి ఆప్రోగ్రామ్ వినాలంటే కుదరదు. అదే ఆ ప్రోగ్రామ్‌ను రికార్డు చేసి ఒక చోట పెట్టి కావాల్సినప్పుడల్లా కావాల్సినన్నిసార్లు వినే ఏర్పాటు చేస్తే?
పాడ్‌కాస్ట్ అలాంటిదే. మీరు మీ సొంతప్రోగ్రామ్స్ రికార్డు చేసి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో పెడతారు. వాటిని ఎవరు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా వింటారు. ఇప్పుడు పాడ్‌కాస్టింగ్ చాలా మంచి హాబీ. డబ్బులు కూడా వస్తాయి... వినేవాళ్లు పెరిగితే. పాడ్‌కాస్ట్ అంటే కేవలం ఆడియోప్రోగ్రామ్ మాత్రమే. ఒకరు/లేదా కొంతమంది మాట్లాడుకునే మాటలను రికార్డు చేసి ఇతరులకు వినిపించడమే పాడ్‌కాస్టింగ్ అంటే.
దానికి ఏం కావాలి?
కంప్యూటర్ కానీ ల్యాప్‌టాప్ కానీ ఉంటే సరిపోతుంది. రికార్డు చేయడానికి మైక్ ఉండాలి. రికార్డు చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ఫ్రీగా దొరుకుతుంది. రికార్డ్ అయిన కార్యక్రమాన్ని ‘ఎంపి3’ ఫార్మాట్‌లో మార్చి పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ ప్లాట్‌ఫామ్స్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకుని ఆ పని చేయవచ్చు. ఇదంతా చాలా సులువు పనే.
పాడ్‌కాస్ట్‌లో ఏం మాట్లాడతారు?
మనుషులకు మాటలు ఇష్టం. మీరు ఏం మాట్లాడినా వింటారు. ఉదాహరణకు ‘నేనూ... మా కుక్కపిల్ల’ అనే సిరీస్‌లో మీరు వరుసగా పాడ్‌కాస్ట్ చేయవచ్చు. ఒక్కో ఎపిసోడ్‌లో మీ కుక్కపిల్లతో మీరు పడుతున్న తంటాలు, అదంటే మీకెంత ఇష్టమో, అది మీరు స్కూల్‌కు వెళ్లినప్పుడు ఎలా ఎదురుచూస్తుందో, మీ ఫుడ్‌ను ఎలా లాక్కుంటుందో ఇవన్నీ మాట్లాడి రికార్డు చేసి పెడితే వినేవాళ్లు ఉంటారు.
పాడ్‌కాస్ట్ చేసే విధం
పాడ్‌కాస్ట్ అంటే చదవడం కాదు. నోట్స్ ముందు పెట్టుకుని చదివితే ఎవరూ వినరు. పాడ్‌కాస్ట్‌ను ఒక డైలాగ్‌లాగా మాట్లాడుతున్నట్టుగా చేయాలి. అఫ్‌కోర్స్... మీరు కొంత నోట్స్ రాసుకున్నా అది పాయింట్స్ గుర్తు రావడానికే తప్ప యథాతథంగా చదవకూడదు. ‘మా అమమ్మ’ అనే టాపిక్ మీద కబుర్లు చెబుతున్నట్టుగా మాట్లాడితే వింటారు.
ఇంటర్వ్యూలు
పాడ్‌కాస్ట్‌లో ఇంటర్వ్యూలు బాగుంటాయి. మీరు మీ అమ్మను, నాన్నను, అన్నయ్యను ఇంటర్వ్యూ చేయొచ్చు. క్లయిమేట్ చేంజ్ గురించి మీ సైన్స్ టీచర్‌ను ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయొచ్చు. సెల్‌ఫోన్ అడిక్షన్ మీద ఒక డాక్టర్‌ను ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇలాంటి వాటికి మమ్మీ, డాడీ సపోర్ట్ తీసుకోవచ్చు. రాబోయే వానాకాలంలో వూళ్లో వాన నీరు వెళ్లాలంటే గవర్నమెంట్ ఏయే పనులు మొదలెట్టాలో చెప్పేలా ఒక పాడ్‌కాస్ట్ చేయొచ్చు.
హ్యారీపోటర్ మీద, అవేంజర్స్ మీద మీ ఫ్రెండ్స్‌ను ఇంటర్వ్యూ చేస్తూ పాడ్‌కాస్ట్ చేయొచ్చు. పాడ్‌కాస్ట్ చేయడం వల్ల మీ ఆలోచనలు, మాట, సమయస్ఫూర్తి పెరుగుతాయి. రీసెర్చ్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంటర్వ్యూలు చేయడం వల్ల ఎక్స్‌పర్ట్‌లతో పరిచయాలు జరుగుతాయి. పేరు వస్తుంది. ఇన్ని మేళ్లు జరుగుతాయి కనుక ట్రై చేయండి. ఈ సెలవుల్లో పాడ్‌కాస్టర్‌గా మారండి. ఆల్ ది బెస్ట్.
ఇంకా ఏం మాట్లాడొచ్చు పాడ్‌కాస్ట్‌లో...
→ తెలుగు పద్యం: వేమన, సుమతి, భాస్కర శతకాల్లో నుంచి ఒక్కో పద్యం తీసుకుని అది మీకు ఎందుకు ఇష్టమో అందులోని నీతి ఏమిటో మీ ఫ్రెండ్‌కు వివరిస్తూ పాడ్‌కాస్ట్ చేయొచ్చు.
→ తెలుగువారి హిస్టరీ నుంచి మీకు నచ్చిన విషయాలను పాడ్‌కాస్ట్ చేయొచ్చు.
→ సినిమాల మీద చేయొచ్చు.
→ ఐ.పి.ఎల్ మేచెస్ మీద చేయొచ్చు.
→ మై డ్రీమ్స్.. అని చేయొచ్చు. ఇవి మీ లక్ష్యాలే కాదు... మీ కలలు కూడా చెప్పచ్చు.