నేడు సీఎం సిద్దరామయ్య రాక
రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం రాయచూరులో పర్యటిస్తారని కేపీసీసీ కార్యాధ్యక్షుడు, ఎమ్మెల్సీ వసంతకుమార్ తెలిపారు. మంగళవారం ఏఐసీసీ ఇన్‌చార్జి గోపీనాథ్ పళనితో కలిసి సమావేశ ఏర్పాట్లను పరిశీలించి ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలకు వ్యతిరేకంగా పార్టీ తరపున డివిజన్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీలు, మంత్రులు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.
ప్రథమ పీయూసీ కోర్సుల్లోకి ఉచిత ప్రవేశం
హుబ్లీ: డాక్టర్ డీజీ శెట్టి ఎడ్యుకేషనల్ సొసైటీ 27 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభవేళ ఆ సంస్థ నిర్వహించే పీఎం శెట్టి మెమోరియల్ స్వతంత్ర పీయూ కళాశాలలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సుల్లోకి 25 మంది చొప్పున మొత్తం 75 మంది విద్యార్థులకు ఈ ఏడాది ప్రథమ పీయూసీలోకి ఉచితంగా ప్రవేశం కల్పించాలని సదరు సంస్థ పాలక మండలి నిర్ణయించింది. ఈ ఉచిత ప్రవేశాలకు అత్యధిక మార్కులను పరిగణించకుండా ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ప్రవేశం కల్పిస్తారు. సంస్థ రజతోత్సవ వేళ కల్పించిన ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డీజీ శెట్టి ఓ ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాలకు సెల్–9343400038 నెంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
గ్రామాల్లో అసమానతలు రూపుమాపాలి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలను రూపుమాపాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ తాలూకా స్థాయి అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా పంచాయతీ సభా భవనంలో ప్రాంతీయ అసమానతల నివారణ సమితి అధ్యక్షుడు గోవిందరావ్ అధ్యక్షతన జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కంపెనీలు ఈ ప్రాంత ప్రజల విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, సమితి సభ్యులున్నారు.
11న బీజేపీ జనాక్రోశ యాత్ర ముగింపు సమావేశం
హుబ్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనాక్రోశ యాత్ర ముగింపు సమావేశాన్ని ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు నగరంలోని మూరుసావిర మఠ ఆవరణలో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ యాత్ర మైసూరు నుంచి ప్రారంభమై బెంగళూరు మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జరిగిందన్నారు. ఆ రోజు దుర్గదబైలు నుంచి మూరుసావిర మఠం వరకు ఆందోళన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. చెత్త నిర్వహణ సుంకం, జనన, మరణ ధృవీకరణ పత్రాల మొదలు సుమారు 50 వస్తువుల ధరలను పెంచారని ఆయన ధ్వజమెత్తారు. సిద్దరామయ్య సర్కారు సామాన్యులపై కనికరం చూపడం లేదన్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని పేద ప్రజల ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొడుతున్నారని మండిపడ్డారు. మంగళూరులో జరిగిన సుహాస్ శెట్టి హత్యకు ముస్లింల ఓటు బ్యాంక్ రాజకీయాల కుమ్మక్కే కారణమన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రముఖులు రాజీవ్, అరవింద బెల్లద, మహేష్ టెంగినకాయి, లింగరాజ్ పాటిల్, తిప్పన్న మజ్జిగి, దత్తమూర్తి కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
రైతు మార్కెట్‌కు వ్యాపారాల తరలింపు
రాయచూరు రూరల్: నగరంలోని ఉస్మానియా కూరగాయల మార్కెట్ వెనుక భాగంలో వ్యాపారస్థులు రహదారిలో కూర్చొని వ్యాపారాలు చేసేవారు. కూరగాయల వాహనాలు, ప్రజల వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణించేవి. రోజు రద్దీగా ఉండే వీధిలో విక్రయదారులు, కొనుగోలుదారులు వ్యాపారం చేస్తున్న సమయంలో ప్రమాదాలు జరగడం, ట్రాఫిక్ స్తంభించడం వంటివి జరిగేవి. ఈ విషయాన్ని గమనించిన కమిషనర్ జుబీన్ మహాపాత్రో సోమవారం ఉస్మానియా కూరగాయల మార్కెట్‌ను సందర్శించి ఖాళీగా ఉన్న రైతు మార్కెట్‌లో వ్యాపారాలు చేసుకోవాలని, ఇకపై రహదారులపై వ్యాపారాలు జరిపితే భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం నుంచి రైతు మార్కెట్‌లో వ్యాపారాలు జరుగుతున్నాయి.
నేడు సీఎం సిద్దరామయ్య రాక
నేడు సీఎం సిద్దరామయ్య రాక


