
షేర్ల పేరుతో రూ.30 కోట్లు స్వాహా
యశవంతపుర: జనం ఆశను ఘరానా దంపతులు సొమ్ము చేసుకున్నారు. షేర్లలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించిన దంపతులు ప్రజలకు రూ.30 కోట్ల వరకూ వసూలు చేసి పరారు కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కలబురగి నగరంలోని రోజా పోలీసుస్టేషన్ పరిధిలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గాంధీ నగరలో ఉత్కృష్ట, సావిత్రి అనే భార్యాభర్తలు ఒక వాణిజ్య కాంప్లెక్స్‌లో షేర్ల ట్రేడింగ్ ఆఫీసును పెట్టారు. యువతీ యువకులను లక్ష్యంగా చేసుకొని దంపతులు తమ వద్ద షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాలని, కొంతకాలంలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని మాయమాటలు చెప్పేవారు. రూ. 25 వేల నుంచి రూ.25 లక్షల వరకూ ఇలా పెట్టుబడులు పెట్టించారు. వీరికి విజయసింగ్ హజారె, సుధా అనే దంపతులు సహరించేవారు. సుమారు 500 మంది నుంచి పెట్టుబడుల పేరుతో రూ. 30 కోట్ల వరకూ వసూలు చేశారు. శనివారం ఎవరికీ చెప్పకుండా అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక వ్యక్తి కారులో సావిత్రి దంపతులు పరారయ్యారు.
కేవైసీ అంటూ రూ.1.80 లక్షలు డ్రా
మైసూరు: మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యింది, కేవైసీ చేయాలి అని మహిళకు ఫోన్ చేసిన సైబర్ దుండగులు ఆమె ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఓటీపీని చెప్పడంతో రూ. 1.80 లక్షలను దోచుకున్నారు. ఈ ఘటన మైసూరు నగరంలోని మహాదేవపురలో జరిగింది. బాధితురాలు లత మొబైల్‌కు కేవైసీ గురించి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె నిజమేననుకుని అందులోని నంబర్‌కు కాల్ చేసింది. మోసగాళ్లు అడగడంతో ఆధార్, ఓటీపీ వివరాలను చెప్పింది, క్షణాల్లోనే ఆమె బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 1.80 లక్షలను దుండగులు డ్రా చేశారు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కలబురగిలో దంపతుల భారీ స్కాం