ఖనిజం అక్రమ రవాణా అరికడతాం
సాక్షి,బళ్లారి: ఇనుప ఖనిజం అక్రమ రవాణా పూర్తిగా నియంత్రిస్తామని, ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ పేర్కొన్నారు. ఆమె సోమవారం తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 16న ఎన్‌ఎండీసీ బ్లాక్ నుంచి 20 టన్నుల ఇనుప ఖనిజం అక్రమంగా తరలిస్తుండటంతో సండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన్నారు. చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు చిదానందప్ప అనే వ్యక్తి ఇనుప ఖనిజం తీసుకెళుతుండగా పట్టుబడ్డారన్నారు. ఆ ఇనుప ఖనిజాన్ని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నేమకల్లు సమీపంలో సాయి బాలాజీ ప్లాంటుకు తీసుకెళుతున్నట్లు సదరు వ్యక్తి తెలిపారన్నారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తున్నామన్నారు.
శ్రీరాములుపై పోక్సో కేసు నమోదు
బ్యానర్ రగడ నేపథ్యంలో ఈనెల 17న నగరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీరాములు నగరంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారని, గంజాయి మత్తులో విద్యార్థులు ఈ అకృత్యానికి పాల్పడ్డారని పాఠశాల, విద్యార్థిని పేరు కూడా బహిరంగ సమావేశంలో ఆవేశ పూరితంగా వెల్లడించడంతో ఏపీఎంసీ పోలీసులు శ్రీరాములుపై మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై మహిళా పోలీసులు పోక్సో కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడటంతో బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, దీనిపై పూర్తి విచారణ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు
నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన పోలీసు అధికారులు, సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటానని, జాగ్రత్తగా పని చేయాలని ఎస్పీ సూచించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మట్కా, పేకాట, గంజాయి తదితర అసాంఘీక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఓ వైపు ప్రతిపక్షాలు, ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐలతో ప్రత్యేక సమావేశంలో జిల్లాలో శాంతిభద్రతలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని హెచ్చరించారు.
మట్కా, జూదం, గంజాయి
సరఫరాని కట్టడి చేస్తాం
బళ్లారి జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ వెల్లడి


