
అంబేడ్కర్ ఆశయాలు ఘనం
కోలారు: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కన్న కలలు, ఆశయాలు గొప్పవని, వాటి గురించి ఒక ఉపన్యాసంతో తెలియజేయడం అసాధ్యం అని హైకోర్టు నివృత్త న్యాయమూర్తి నాగమోహనదాస్ తెలిపారు. శనివారం నగరంలోని నచికేత నిలయం ప్రాంగణంలో బుడ్డిదీప ఆధ్వర్యంలో అంబేడ్కర్ చదువు– 2 కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభ్యాసం అనేది మానవ జీవితంలో నిరంతరంగా జరగాలన్నారు. కులమతాల ఆధారంగా చట్టాల రూపకల్పన సమాజంపై దుష్పరిణామం చూపుతుందన్నారు. గతంలో గ్రామాల్లో పెద్దల పంచాయతీలు ఉండేవన్నారు. గ్రామీణ ప్రాంతాలలో సత్యాన్ని అన్వేషించడమే వీటి ఉద్దేశమన్నారు. గతంలో గ్రామీణులకు న్యాయం, చట్టాల గురించి ఎలాంటి అవగాహన లేకున్నా చక్కగా న్యాయ నిర్ణయం చేసేవారన్నారు. నేడు సమాజంలో అక్కడక్కడ గొడవలు, సంఘర్షణలు కనిపిస్తున్నాయన్నారు. సామాజిక న్యాయం కోసం పని చేసే వారిపై నేడు అధిక బాధ్యత ఉందన్నారు. సాహితీవేత్త కోటిగానహళ్లి రామయ్య, ఉపన్యాసకుడు అరివు శివప్ప, ప్రొఫెసర్ ప్రసన్న కుమారి, పాత్రికేయుడు కెఎస్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.