ఏజీ కార్యాలయం తాజా అభ్యంతరాలివే!
బల్దియా ఆడిట్‌లో తేడాలు
ప్రీ ఆడిట్, జిల్లా ఆడిట్‌లో అంతా ఓకే
ఏజీ కార్యాలయం రిపోర్టులో అనేక అభ్యంతరాలు
సమాధానం దాటేస్తున్న ఎంసీకే
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే) చేసిన ఖర్చులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా బల్దియా చేసిన పనిపై మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో జరిగే ప్రీ ఆడిట్, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జరిగే ఆడిట్ లో ఎలాంటి అభ్యంతరాలూ కానరావడం లేదు. కానీ, భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించే అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం చేస్తున్న ఆడిట్‌లో మాత్రం ప లు అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. అయితే, ఏజీ కార్యాలయం లేవెనెత్తిన అభ్యంతరాలైనా పరిష్కారానికి నోచుకుంటున్నాయా? అంటే అది కూడా సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో బల్దియా అధికారులకు ఏజీ కార్యాలయం పంపే రిమైండర్ నోటీసులు అంటే లెక్కేలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నోటీసులను ఎంసీకే కమిషనర్ కార్యాలయం ఎప్పటికపుడు ఆ సమాధానాలను దాటవేస్తూ వస్తుంది తప్ప.. ఇంతవరకూ సమాధానాలు సమర్పించకపోవడం విశేషం.
భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరించే అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆర్థిక జవాబుదారీతనం చట్టపరమైన నిబంధనల అమలు, ప్రజానిధుల సద్వినియోగాన్ని నిర్ధారించడానికి పట్టణ స్థానిక సంస్థల ఖాతాలను మూడు సంవత్సరాలకు ఒకసారి ఆడిట్ చేస్తారు. ఈ విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ అకౌంట్స్ మీద కూడా 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీటెయిల్డ్ ఆడిట్ నిర్వహించి ఫిబ్రవరి 2026న లేవనెత్తిన ఇన్‌స్పెక్షన్ రిపోర్టు కాపీల మీద వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా గానీ, అధికారులు కావాలని నిర్లక్ష్యం వహించారు. ఈ విషయమై గతనెలలో మరోసారి ఇన్‌స్పెక్షన్ రిపోర్టు మీద వివరణ ఇవ్వాలని, లేవనెత్తిన అంశాల మీద తీసుకున్న చర్యల వివరాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా సమర్పించాలని అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం ఆదేశించింది. నిబంధనల ప్రకారం.. స్థానిక సంస్థలు తమ రిపోర్టుపై వివరణ కోసం ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఏజీ కార్యాలయం రిమైండర్ జారీ చేయాలి. కానీ, ఆగస్టులో జారీ కావాల్సిన రిమైండర్ అక్టోబరులో జారీ అవడం అనుమానాలకు తావిస్తోంది.
మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన వీధిదీపాల (45 నుంచి 200 వాట్ల సామర్థ్యం) కొనుగోలులో వస్తువు స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ ఎస్ ఆర్) రేటు కంటే 13.615 శాతం అదనంగా జోడించి కొనడం వల్ల ఖజానాకు రూ.1.15 కోట్ల నష్టం కలిగింది.
గాల్వనైజ్‌డ్ ఆక్టాగోనల్ పోల్స్ కు అమర్చిన లైట్ల కొనుగోలులో రూ.2.60 కోట్ల నిధులు అధికంగా వెచ్చించారని ఏజీ నివేదిక తెలిపింది. 708 గాల్వనైజ్‌డ్ ఆక్టాగోనల్ పోల్స్ (డబుల్ ఆర్మ్) కు 1416 వీధిదీపాలు ఉండాలి. కానీ, ఈ పోల్స్ సింగిల్ ఆర్మ్ కే వీధిదీపాలు అమర్చి డబుల్ ఆర్మ్‌కు బిల్లులు క్లెయిం చేశారు.
రూ.62.44 లక్షల అంచనా విలువతో జూలై 2022లో ఇంటినెంబరు 4–69/49/ ఎస్ నుంచి రైల్వేగేట్, రైల్వేగేట్ నుంచి కామధేను స్టీల్ షాప్, స్టీల్ షాపు నుంచి పారడైజ్ రెస్టారెంట్ వరకు చేపట్టిన సీసీ డ్రెయిన్, స్లాబ్ కల్వర్ట్ నిర్మాణంలో రూ.19.53 లక్షల అనుమానాస్పద పనులు రికార్డయ్యాయని ఏజీ రిపోర్ట్ పేర్కొంది. వాస్తవానికి ఈ పని జూలై లో అగ్రిమెంట్ కాగా ఏఈ బిల్లును రెండు నెలలు ముందుకు వెళ్లి మే నెలలో రికార్డు చేయడం గమనార్హం.
పాత 21వ డివిజన్‌లో శుభం గార్డెన్స్ సమీపంలో సీసీ రోడ్, హెచ్‌డీపీఈ పైప్‌లైన్ కోసం రూ. 30లక్షల అంచనాతో పిలిచిన టెండరుకు పరిపాలన అనుమతులు లేకుండా టెండరు పిలవడం, వర్క్ కంప్లీషన్ రిపోర్టు లేకుండా బిల్లులు విడుదల చేయడాన్ని ఏజీ రిపోర్టు ఎత్తిచూపింది.
ఆటో రిజిస్ట్రేషన్ నంబర్లు లేకుండా లాగ్ బుక్కులు నిర్వహించకుండా.. ఇంధన బిల్లుల మీద సీరియల్ నంబర్లు లేకుండానే రూ.లక్షల్లో బిల్లులు డ్రా చేసుకున్నారని ఏజీ నివేదిక పేర్కొంది.
అంతిమ యాత్ర పథకం కింద పౌరులు చని పోతే రూ.10వేలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను బల్దియా నియమించింది. అగ్రిమెంట్ ప్రకారం.. గుత్తేదారే అన్ని నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి. బల్దియాలో ఉన్న రెండు అంతిమయా త్ర వాహనాలను ఇందుకోసం వినియోగించాలి. కానీ, అగ్రిమెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఏప్రిల్ 2025 నుంచి డిసెంబరు 2025 వరకు ఈ రెండు వాహనాలలో బల్దియాలో నిధులతో డీజీల్ పోయించడం వల్ల ఖజా నాకు రూ.6.89 లక్షల నష్టం కలిగింది. ఇదే విధంగా 2022 నుంచి 2025 వరకు లెక్కిస్తే.. డీజిల్ పేరిట రూ.20.68 లక్షలు, మొత్తంమీద రూ.27.58 లక్షల బిల్లుల రూపంలో నష్టం వాటిల్లిందని ఏజీ వివరించింది. ఖజా నాకు నష్టం వాటిల్లిన ఈ బిల్లులను రికార్డు చేసిన, ప్రాసెస్ చేసిన, రికమండ్ చేసిన, రిలీజ్ చేసిన అధికారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఏజీ స్పష్టంచేసింది.
చెత్త ఎత్తుకుపోయే కొత్త కాంపాక్టర్ వ్యాన్‌లలో సాధారణంగా 120 లీటర్ల డీజిల్ నాలుగైదు రోజులకు సరిపోతుంది. కానీ, బల్దియా ప్రతీరోజూ కాంపాక్టర్ వాహనాల్లో రోజుకు 120 లీటర్ల డీజిల్ వినియోగించుకున్నాయని రికార్డుల్లో రాయడాన్ని అనుమానాస్పద చర్యగా గుర్తించింది.
భూభారతి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబరు 1166, 1312లలో ఉన్న ప్లాట్లకు భవన నిర్మాణాలకు అనుమతించడమే కాకుండా.. బెటర్‌మెంట్ ఛార్జీలు, వెహెకెంట్ ల్యాండ్ టాక్స్ కలెక్ట్ చేయలేదని ఏజీ వెల్లడించింది. ఈ విషయమై కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


