ఏం జరుగుతోంది? | - | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది?

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

డంప్‌యార్డ్‌ టెండర్‌ చుట్టూ వివాదం? ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు తమకు అవకాశం రానివ్వలేదన్న కొన్ని ఏజెన్సీలు నిబంధనలు పాటించడం లేదంటూ ఆరోపణలు టెండర్‌ నిబంధనలు పాటించామంటున్న అధికారులు

ఏం జరిగింది..

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌ చెత్తబయోమైనింగ్‌ టెండర్‌ చుట్టూ వివాదం రాజుకుంటోంది. ఓ వైపు టెండర్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, మరో వైపు టెండర్‌ నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించలేదంటూ కొన్ని కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇవ్వడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము టెండర్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదని, టెండర్‌ వాయిదా వేయాలని కోరినా పట్టించుకోలేదని ఆ ఏజెన్సీలు ఫిర్యాదులో పేర్కొన్నాయి. కాగా నిబంధనల ప్రకారమే టెండర్‌ నిర్వహించామని, ఇందులో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేదని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టెండర్‌ను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని, కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, టెండర్‌పై ఫిర్యాదులు వెలుగు చూడడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే ఫిర్యాదులు...

డంప్‌యార్డ్‌లో చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు నగరపాలకసంస్థ గత నెలలో టెండర్‌ పిలవడం తెలిసిందే. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం డంప్‌యార్డ్‌లో 4 లక్షల 46 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త ఉండగా,అందులో నుంచి 2 లక్షల 64 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసేందుకు స్వచ్చ భారత్‌ మిషన్‌ నిధులు రూ.17 కోట్లతో టెండర్‌ చేపట్టారు. గత నెల 10వ తేదీ నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో టెండర్‌కు అవకాశం కల్పించారు. అయితే రూ.10 కోట్లు దాటిన టెండర్‌ను నిర్వహించాల్సిన నిబంధనలను అధికారులు పాటించలేదంటూ కొంతమంది కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో టెండర్‌ గైడ్‌లైన్స్‌ తమకు కనిపించడం లేదంటూ, వరుసగా సెలవులు వచ్చినందున టెండర్‌ గడువు పొడగించాలంటూ మరికొంతమంది కలెక్టర్‌, సీడీఎంఏలకు ఫిర్యాదు చేశారు.

నిబంధనల ప్రకారమే..

చెత్త బయోమైనింగ్‌ టెండర్‌ను పూర్తిగా నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామని నగరపాలకసంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం గత నెల 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెండర్‌ను అందుబాటులో ఉంచామని, ఎవరైనా బిడ్‌ దాఖలు చేసుకొనే అవకాశం ఉందంటున్నారు. కాని చివరి రోజు వచ్చి టెండర్‌ గడువు పొడిగించాలని కొంతమంది కోరితే,అప్పటికే 15 రోజులు ఆన్‌లైన్‌లో ఉన్నందున నిబంధనల ప్రకారం పొడగించడం కుదరదని చెప్పినట్లు ఓ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. అలాగే గైడ్‌లైన్స్‌ ఆన్‌లైన్‌లో కనిపించకపోవడమనేది ఉండదంటున్నారు. టెక్నికల్‌బిడ్‌ ఓపెన్‌ చేసిన అనంతరం ఈఎన్‌సీ ఆమోదానికి పంపించామని, ఈఎన్‌సీ ఆమోదం పొందినతరువాత ప్రైస్‌బిడ్‌ ఓపెన్‌ చేస్తామని తెలిపారు.

సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి...

బయోమైనింగ్‌ టెండర్‌పై ఫిర్యాదులు, వివాదం, రాజకీయ ఆరోపణలుప్రత్యారోపణలు ఓ వైపుకొనసాగుతుంటే, బాధితులు మాత్రం డంప్‌యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పాలకులను వేడుకొంటున్నారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి నోచుకొంటుందని ఆశిస్తుంటే, ఈ వివాదాలు, ఫిర్యాదులతో వారు కలవర పడుతున్నారు. నిత్యం డంప్‌యార్డ్‌ పొగతో రోగాల బారిన పడుతున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డంప్‌ యార్డ్‌ను పూర్తిగా అక్కడి నుంచి ఎత్తివేయాలంటున్నారు. రాజకీయాలకు అతీతంగా డంప్‌యార్డ్‌ సమస్యకు ముగింపు పలకాలని కోరుతున్నారు.

ఐదు లక్షల జనాభా ఉన్న నగరానికి ప్రధాన ఇబ్బందిగా మారిన డంప్‌యార్డ్‌ సమస్య పరిష్కార ప్రారంభ దశలోనే వివాదాస్పదమవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకొంది. టెండర్‌ ప్రక్రియ నిజంగా వివాదాస్పదంగా మారిందా...లేక కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చెబుతున్నట్లు కావాలని వివాదాలు సృష్టిస్తున్నారా అనే చర్చ సర్వత్రా నెలకొంది. చెత్తను బయోమైనింగ్‌ చేస్తే పరిష్కరించిన ఘనత తమకు రాకుండా చేసేందుకు కావాలని టెండర్‌పై లేనిపోని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కాగా... సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న డంప్‌యార్డ్‌ ప్రక్షాళనకు పూర్తి సహకారం అందిస్తున్నామని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. మొత్తం 4 లక్షల 46 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేసి డంప్‌యార్డ్‌ను పూర్తిగాఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త బయోమైనింగ్‌కు సంబంధించిన టెండర్‌ వివాదాస్పదం అవుతుండడం, రాజకీయంగా పరస్పర ఆరోపణలకు వేదికగా మారుతోంది.

వివాదమా.. సృష్టిస్తున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement