కరీంనగర్/కోల్‌సిటీ: మనిషి శరీరంలో బయటకు కనిపించని అనేక రుగ్మతలు ఉంటాయి. ఎముక విరిగినా.. ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తినా.. గుండె పనితీరులో మార్పులొచ్చినా.. వాటిని పైకి చూసి గుర్తించడం సాధ్యం కాదు. అలాంటి అంతర్గత సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించే అద్భుతమే రేడియాలజీ. ఒకప్పుడు నలుపు తెలుపు ఎక్స్‌రే చిత్రాలకే పరిమితమైన ఈ వైద్య పరిజ్ఞానం నేడు డిజిటల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, 3డీ ఇమేజింగ్ వరకు విస్తరించింది. ఉత్తర తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక మిషనరీలు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
శరీర అంతరంగాలపై చిత్రముద్ర
ఎక్స్‌రే పరీక్ష ద్వారా ఎముకల విరుగుళ్లు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు, ఛాతీలోని మార్పులు, కొన్ని రకాల కణితులు, శరీరంలోని రాళ్లను గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్ ద్వారా గర్భంలోని శిశువు ఎదుగుదల, అవయవాల పరిస్థితిని తెలుసుకోవచ్చు. సీటీ స్కాన్‌తో శరీరంలోని అంతర్గత నిర్మాణాలను పలుకోణాల్లో పరిశీలించవచ్చు. ఎంఆర్‌ఐతో మెదడు, వెన్నెముక, కండరాలు, ఇతర మదు కణజాలాల సమస్యలను స్పష్టంగా గుర్తించవచ్చు. గుండె, మెదడు, మూత్రపిండాలు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణలోనూ ఇవి కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి.
ఏఐతో మరింత కచ్చితత్వం..
రేడియాలజీ రంగంలో కృత్రిమ మేధ సరికొత్త మార్పులకు నాంది పలుకుతోంది. స్కానింగ్ చిత్రాలను విశ్లేషించి వ్యాధి లక్షణాలను త్వరగా గుర్తించేందుకు ఉపయోగపడుతోంది. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ఊపిరితిత్తుల్లో చిన్నపాటి గడ్డల గుర్తింపు, గుండె రక్తనాళాల్లో అడ్డంకుల పరిశీలన వంటి అంశాల్లో ఇది తోడ్పడుతోంది.
చికిత్సలోనూ రేడియాలజీ ముద్ర
ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా స్కానింగ్ చిత్రాల సహాయంతో శరీరంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, చిన్న రంధ్రం లేదా సూది ద్వారా కొన్ని రకాల చికిత్సలు నిర్వహిస్తున్నారు. రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించడం, రక్తస్రావాన్ని నియంత్రించడం, కొన్ని కణితులకు చికిత్స చేయడం వంటి ప్రక్రియలు సాధ్యమవుతున్నాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
ఆయనీకరణ వికిరణాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రేడియేషన్ మోతాదును సాధ్యమైనంత తక్కువగా ఉంచాలనే ఉద్దేశంతో ‘అలారా’ సూత్రాన్ని పాటిస్తారు. అంటే పరీక్షకు అవసరమైన స్థాయిలోనే వికిరణాలను వినియోగించాలి.


