కరీంనగర్‌కల్చరల్/విద్యానగర్: వర్ణాల కాంతులు.. దీపాల వెలుగులు.. పులకించే మనసులు.. ఉప్పొంగే తనువులు.. వెలుగులు పర్వదినం దీపావళికి సంకేతాలు. చెడుపై మంచి సాఽధించిన విజయానికి గుర్తుగా దీపావళిని ఆదివారం ప్రజలు ఆనందంగా జరుపుకోనున్నారు. వ్యాపార సముదాయాల వద్ద లక్ష్మీదేవికి పూజలు నిర్వహంచడం అనవాయితీ. ఇంటిల్లిపాది ఉత్సాహంగా పాల్గొనే సంబురం. ఉదయాన్నే లేవడం, తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం విందు భోజనాలను ఆరగించడంతో సాయంత్రానికి అసలైన ఆనందం మొదలవుతుంది. నిశీధి నిశ్శబ్దాన్ని బాణసంచాలతో బెదరగొట్టి చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే సంబురమే దీపావళి.
లక్ష్మి పూజలు
దీపావళి అమావాస్య రోజున లక్ష్మిపూజకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సహస్రనామాలతో, అష్టోత్తరాలతో, దండకాలతో లక్ష్మిదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి పూజలు చేస్తారు. లక్ష్మిదేవి కటాక్షం కోసం, అసుర సంధ్యవేళతో ఇళ్లలోకి వస్తుందనే నమ్మకంతో ఆమెకు స్వాగతం పలికి సాదా తమ ఇళ్లలో కొలువుతీరమని వేడుకుంటూ పూజలు చేస్తారు.
టపాసులతో జాగ్రత్త
దీపావళి పండుగ ఎందరికో ఆనందాన్ని కలిగిస్తే మరికొందరిని విషాదంలో నింపుతుంది. అతి ఉత్సాహంతో టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని కారణంగా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఆస్పత్రుల పాలవుతుంటారు. గతకాలంలో దీపాల వెలుగులకు, పొటాష్ మందుగుండు దిబ్సిసాలకే పరిమితమైన పండుగ ఇప్పుడు బాంబులు, టపాసుల పేలుళ్లతో వాడవాడలా దద్దరిల్లిపోతున్నాయి. హైడ్రోజన్, డబుల్ సౌండ్స్, త్రిబుల్ సౌండ్స్ వంటి పేర్లతో తయారు అవుతున్నాయి. సాధారణంగా మనిషి వినికిడి శక్తి 50 డెసిబుల్స్ మాత్రమే. అంతకు మించిన శబ్దాలను వింటే చెవికి ఎంతో కొంత మేరకు నష్టం కలుగుతుంది. 70 డెసిబుల్స్ దాటిన ధ్వనులను వింటే నష్టం తీవ్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలతో దీపావళిని జరుపుకోవాలి.
నేడు దీపావళి పర్వదినం
కేదారీ నోములు, లక్ష్మిదేవి పూజలు
మార్కెట్లో సందడి..
టపాసులతో జాగ్రత్త అంటున్న నిపుణులు


