మద్యం మత్తు.. స్నేహితుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తు.. స్నేహితుడి దారుణ హత్య

Nov 7 2026 12:06 AM | Updated on Nov 7 2026 12:06 AM

కరీంనగర్‌క్రైం: మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం దారుణ హత్యకు దారి తీసింది. చిన్నపాటి గొడవ కాస్తా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరడంతో ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కరీంనగర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. జహీరాబాద్‌కు చెందిన మద్ది సుధాకర్‌ అలియాస్‌ సిద్ధు(23) మంచిర్యాల చౌరస్తా సమీపంలోని ఓ ఫుడ్‌ కోర్టులో పని చేస్తున్నాడు. అతడికి కార్ఖానగడ్డకు చెందిన మీర్జా ఇబ్రహీం బేగ్‌(23)తో గతంలో పరిచ యం ఏర్పడి స్నేహితులుగా మారారు. ఇద్దరూ తరచూ కలిసి మద్యం తాగుతూ బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరించేవారు. ఈ క్రమంలో రెండు, మూడు రోజులుగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో సుధాకర్‌.. ఇబ్రహీం బేగ్‌ కుటుంబ సభ్యులను ఉద్దేశించి దూషించడంతో.. ఆగ్రహానికి గురైన బేగ్‌ సమీపంలో ఉన్న సిమెంట్‌ బండరాయితో సుధాకర్‌ తలపై సుమారు పదిసార్లు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. బస్టాండ్‌ సిబ్బంది వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement