● రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి
కరీంనగర్‌టౌన్: ఉపాధ్యాయుల మేధస్సుకు కృత్రిమ మేధస్సు(ఏఐ) తోడైతే విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించొచ్చని రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికనుగుణంగా బోధనా పద్ధతుల్లోనూ మార్పులు తీసుకురావాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బెటర్ లెర్నింగ్ అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 98 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 330 మంది గణితం, భౌతిక, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐని సహాయక సాధనంగా ఉపయోగించుకుంటే పాఠ్యాంశాలను సులభంగా, ఆసక్తికరంగా బోధించొచ్చన్నారు. ప్రపంచ పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు ఈ సాంకేతికతపై పట్టు సాధించాలని సూచించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఏఐపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ఆర్డీవో షర్మిల, ఇన్‌చార్జి డీఈవో తిరుపతిరావు, రిసోర్స్‌పర్సన్ లక్ష్మీనాథం, విద్యాశాఖ కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, సైన్స్ ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, నంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


