మార్కుల ముచ్చట్లు | - | Sakshi
Sakshi News home page

మార్కుల ముచ్చట్లు

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

గంభీరావుపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపు.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై సమగ్ర విశ్లేషణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించేందుకు ఈనెల 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌(పీటీఎం) నిర్వహించనున్నారు. విద్యార్థులు సాధించిన మార్కులను, వారి పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2,465 పాఠశాలలు, 1.49 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు.

విద్యార్థుల చేతుల్లోకి ‘సమగ్ర ప్రగతి పత్రాలు’

ఇటీవల నిర్వహించిన సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎస్‌ఏ)–1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను ఈ సమావేశాల్లో విశ్లేషించనున్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులు సాధించిన మార్కులు, వారి అభ్యసన సామర్థ్యాలు, చదువులో వెనుకబడిన అంశాలను ఉపాధ్యాయులు వివరించనున్నారు. విద్యార్థుల సమగ్ర విద్యా పురోగతిని తెలియజేసే ‘హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డు’లను (హెచ్‌పీసీ) సైతం అందజేయనున్నారు.

కార్డులో ‘నా గురించి’

విద్యార్థుల విద్యాసంబంధ ప్రగతి, సహ పాఠ్యకార్యక్రమాలు, హాజరు, ప్రవర్తన నమోదుకు సమగ్ర ప్రగతికార్డులను రూపొందించారు. ఈ కార్డులో విద్యార్థుల పూర్తి వివరాలతోపాటు పలు అంశాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల సాయంతో విద్యార్థులు ఈ అంశాలను నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థుల అభిరుచులు.. ఖాళీ సమయంలో ఏం చేస్తారు.. విద్యాసంవత్సరానికి విద్యాలక్ష్యం.. ఏమి కావాలనుకుంటున్నారు.. ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న మూడు కొత్త విషయాలు కార్డుల్లో రాయాల్సి ఉంటుంది.

వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా ప్రత్యేక బోధనందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థుల అభ్యసన లోపాలను అధిగమించేందుకు ఉపాధ్యాయులు చేపట్టే కార్యాచరణను తల్లిదండ్రులకు వివరించనున్నారు. ఇంటి వద్ద పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపేలా అవగాహన కల్పించనున్నారు.

నేడు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మెగా పీటీఎం’

విద్యార్థుల ప్రగతిపై వివరించనున్న ఉపాధ్యాయులు

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సమావేశాలు

మెగా పీటీఎంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ(ఏఏపీసీ) సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాలు విజయవంతంగా జరిగేలా సంబంధిత మండలాల ఎంఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెరిగితేనే విద్యార్థుల ప్రతిభకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని విద్యాశాఖ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement