వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న దేవస్థానానికి వరంగల్‌కు చెందిన భక్తులు తనుగుల రత్నాకర్–అన్నపూర్ణ దంపతులు భారీ కానుకను బుధవారం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుమారుడు జయంత్ పేరిట సుమారు 2 కిలోల బరువు గల వెండి గంప, బిందె, ప్లేట్‌ను తయారు చేయించి స్వామివారికి కానుకగా అందజేసినట్లు తెలిపారు. ఈ వెండి కానుకలను రాజన్న ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
కోరుట్ల: అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించిన తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ఎదుట భార్య బుధవారం ఆందోళనకు దిగింది. కోరుట్లకు చెందిన తన భర్త గట్ల రాజు, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులతో తాను 20 నెలల క్రితం ఆత్మహత్యకు యత్నించానని, తనను విదేశాల్లో ఉంటున్న తన భర్త రాజు ఆదుకోవాలని కోరింది. ఆందోళన విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.


