కార్పొరేట్‌ర్లు? | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ర్లు?

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

●

ఆడియో రికార్డుల టెన్షన్‌

కేంద్ర మంత్రి ‘క్లాస్‌’తో హాట్‌టాపిక్‌

జాగ్రత్తలు చెప్పాడంటున్న బీజేపీ

ఆధారాలున్నాయంటున్న బీఆర్‌ఎస్‌

రెండు పార్టీలదీ అదే

తీరంటున్న కాంగ్రెస్‌

ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ దుమారం

ఎవరా..

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

నగరంలోని కొంతమంది కార్పొరేటర్లు తమ డివిజన్లలో అరాచకాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఇండ్లు, భవనాల నిర్మాణాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలను ‘సీ ట్యాక్స్‌’, ‘సీ ట్యాక్స్‌ స్పీడప్‌’, ‘కార్ప్ఙొరేట్‌’ర్లు’ శీర్షికన గతంలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం తెలిసిందే. ప్రస్తుతం స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ‘సాక్షి’ కథనాలకు బలం చేకూర్చగా, మరోసారి కొంతమంది కార్పొరేటర్ల అక్రమ వసూళ్లపై తీవ్రస్థాయిలో చర్చమొదలైంది. నగరంలో ఇండ్లు, భవనాలు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పెరుగుతున్నాయి. రుణాలు తీసుకొని తమ జీవిత స్వప్నం నెరవేర్చుకొంటున్న సమయంలో కొంతమంది కార్పొరేటర్లు రూ.లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతుండడంతో నిర్మాణదారులు బేజారవుతున్నారు. జీవితంలో ఇల్లు కట్టుకుంటే చాలనుకునే మధ్యతరగతి జీవులు కార్పొరేటర్ల ఆగడాలను తట్టుకోలేకపోతున్నారు. తమ డివిజన్‌ పరిధిలో కంకర, ఇసుక కనిపిస్తే చాలు టక్కున వాలిపోయి, ‘ఏం కడుతున్నారు.. ఎవరు కడుతున్నారు’’ అంటూ ఆరా తీసి దందాకు పాల్పడుతున్నారు. ఒకరిద్దరు కార్పొరేటర్లు నిర్మాణాల వివరాలతో డైరీ మెయింటెయిన్‌ చేస్తున్నారు.

‘బండి’ క్లాస్‌తో బేజార్‌

నిర్మాణదారుల నుంచి వసూళ్లు, భూ దందాల్లో వేలుపెడుతున్న ఘటనలు తన దృష్టిలో ఉన్నాయంటూ బండి సంజయ్‌ ఇచ్చిన వార్నింగ్‌తో నగరంలోని అక్రమ వసూళ్ల పుట్ట కదులుతోంది. అవినీతి, అక్రమాలు సహించేది లేదంటూ మంత్రి చేసిన ఘాటు వ్యాఖ్యలు నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన వద్ద సమాచారం ఉండడంతోనే పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడనే ప్రచారం బీజేపీలో అంతర్గతంగా ఉంది. దీంతో మంత్రి వద్ద ఉన్న సమాచారం ఎవరిది, ఎవరు చెప్పి ఉంటారు.. అంటూ ‘సంబంధిత’ కార్పొరేటర్లలో పరేషాన్‌ మొదలైంది. ఈ మధ్యకాలంలో మంత్రిని తమ ప్రాంతంలోని ‘బాధితులు’ ఎవరైనా కలిశారా అంటూ ఆరా తీస్తున్నారు.

డబ్బులు ఇవ్వాలంటూ నిర్మాణదారులను బెదిరించిన ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయంటూ బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలతో బీజేపీ కార్పొరేటర్లలో టెన్షన్‌ మొదలైంది. ఆడియో రికార్డులు నిజంగానే ఉన్నాయా, లేక బెదిరించడానికి అంటున్నారా, ఉంటే ఎవరివి ఉన్నాయి అంటూ ఆ పార్టీలో ఉన్న తమ సన్నిహితులతో పలువురు ఆరా తీస్తున్నట్లు సమాచారం. డబ్బులు వసూలు చేసిన సమయంలో ఎవరెవరితో మాట్లాడారో, బెదిరించారో గుర్తుకుతెచ్చుకొని, మధ్యవర్తుల ద్వారా వారితో సంప్రదింపులకు దిగుతున్నారు. ఒకవేళ ఆడియో రికార్డులు ఉన్నట్లు తేలితే రాజీకి సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement