గుస్సాడీ.. ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

గుస్సాడీ.. ప్రారంభం

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

వారం రోజుల షెడ్యూల్‌ ఇదే..

● మొదటిరోజు గ్రామదేవతలకు మొక్కి పూజలు నిర్వహించి వారంరోజుల పండుగను ప్రారంభిస్తారు.

● రెండోరోజు గిరిజనులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్తారు.

● మూడోరోజు వెళ్లిన గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ నృత్యాలు, మహిళల కోలాటాలతో కోలాహలంగా గడుపుతారు.

● నాలుగో రోజు గ్రామంలోని ఇంటింటికీ మంగళహారతులతో వెళ్లి పూజలు నిర్వహిస్తారు.

● ఐదోరోజు కుల పెద్ద ఇంటి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి విందు భోజనాలు ఆరగిస్తారు.

● ఆరోరోజు కుల పెద్దకు ఇంటిదేవతను అప్పగిస్తారు.

● ఏడో రోజు దీక్ష విరమణ.

రాయికల్‌ : గిరిజనులు తరతరాల నుంచి వచ్చే గుస్సాడీ బంధాన్ని హైటెక్‌ యుగంలోనూ కొనసాగిస్తున్నారు. ఏటా దీపావళి సందర్భంగా గిరిజనులు వారంపాటు గ్రామంలో వేడుక జరుపుకుంటున్నారు. రాయికల్‌ మండలంలోని జగన్నాథపూర్‌, బీర్‌పూర్‌, సారంగాపూర్‌ మండలాల్లోని చిత్రవేణిగూడెంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిర్మల్‌ జిల్లా చిట్యాల, ఆదిలాబాద్‌ జిల్లా ఊట్నూరు మండలం నుంచి గిరిజనులు గుస్సాడీ వేషధారణతో జగన్నాథపూర్‌ గ్రామానికి వచ్చి దండారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

వేషధారణ ప్రత్యేకం

గుస్సాడీ వేషధారులు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. సంబరాలు ముగిసే వరకు ఒకే దగ్గర ఉంటారు. స్నానం చేయరు. వీరిని దేవతలు ఆవహిస్తారని, చేతిలోని మంత్రదండంతో శరీరాన్ని తాకితే వ్యాధులు నయమవుతాయని గిరిజనులు నమ్ముతారు. గుస్సాడీలను ఆహ్వానించి అతిథి భోజనాలు పెడితే సంతానం కలుగుతుందన్న భరోసా. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన కుంటే ధరిస్తారు. డప్పులు, బాజాలు, తుడుం మొదలైన వాయిద్యాల శబ్దాలకు గజ్జెల సవ్వడిని అనుగుణంగా అడుగులు వేస్తూ చేతిలో మంత్రదండాన్ని కదిలిస్తూ.. నృత్యాలు చేస్తారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌తోపాటు జిల్లా నుంచి సుమారు 500 మంది గిరిజనులు జగన్నాథ్‌పూర్‌ చేరుకున్నారు.

గోండులను కలుపుతున్న దీపావళి వేడుక

దశాబ్దాలుగా వస్తున్న గిరిజనుల సంప్రదాయం

రాయికల్‌ మండలం జగన్నాథ్‌పూర్‌లో ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement