డెంగీ కాటేసింది..! | - | Sakshi
Sakshi News home page

డెంగీ కాటేసింది..!

Nov 3 2026 12:33 AM | Updated on Nov 3 2026 12:33 AM

గొల్లపల్లి: నిన్నటిదాకా కళ్లముందు తిరిగిన ఆ యువకుడిని డెంగీ బలి తీసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చందోలికి చెందిన పిట్టల రమేశ్‌(30) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గత నెల 25న తీవ్ర జ్వరం రావడంతో కుటుంబసభ్యులు జగిత్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. నయం కాకపోవడంతో అక్టోబరు 30న రక్తపరీక్షలు చేయించగా డెంగీగా నిర్ధారణ అయింది. ప్లేట్‌లెట్లు పడిపోయి పరిస్థితి విషమించడంతో 31న కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అక్కడి వైద్యులు చెప్పడంతో అదేరోజు అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే మెదడులో రక్తస్రావం (బ్రెయిన్‌ బ్లీడింగ్‌) కావడంతో పరిస్థితి మరింత చేయిదాటింది. రెండు రోజులపాటు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ శరీరం సహకరించకపోవడంతో మృతిచెందాడు.

అప్పుల పాలైనా దక్కని ప్రాణం

రమేశ్‌ ప్రాణం ఎలాగైనా నిలబెట్టుకోవాలని కుటుంబసభ్యులు తాపత్రయపడ్డారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యచికిత్సల కోసం సుమారు రూ.4.50 లక్షల వరకు వెచ్చించారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బంధువులు, స్నేహితులు కొంతవరకు ఆర్థికసాయం అందించగా.. మిగిలిన మొత్తాన్ని అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి ఆసుపత్రులకు చెల్లించారు. అప్పుల పాలైనా తమ కళ్లముందు బిడ్డ ప్రాణాలతో తిరిగొస్తాడని ఆశించిన ఆ పేద కుటుంబానికి చివరకు శోకమే మిగిలింది.

కన్నీటి సంద్రంలో చందోలి..

రమేశ్‌ మృతదేహం స్వగ్రామమైన చందోలికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త శవంపై పడి భార్య లాస్య పెట్టిన రోదనలు స్థానికుల హృదయాలను పిండేశాయి. తండ్రి ఇక లేడన్న విషయం తెలియక అమాయకంగా చూస్తున్న కొడుకు, కూతురును చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. సంపాదించే వ్యక్తి అర్ధంతరంగా తనువు చాలించడంతో అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆ అభాగ్య కుటుంబాన్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పెద్ద మనసుతో ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

ఆస్పత్రులు తిరిగినా దక్కని ప్రాణం

మెదడులో బ్లీడింగ్‌తో యువకుడి మృతి

రూ.4.50లక్షలు అప్పు చేసి వైద్యం అందించినా దక్కని ప్రాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement