● రద్దీ ప్రాంతాల నుంచి ద్విచక్ర వాహనాల చోరీ ● ఆందోళన చెందుతున్న వాహనదారులు
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలతోపాటు, మండల కేంద్రాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్తున్నారు. పార్కింగ్ చేసిన వాహనాలపై నిఘా పెట్టి చోరీలకు పాల్పడుతున్నారు.
రద్దీ ప్రాంతాల నుంచి..
పట్టణాల్లో ప్రధానంగా కళాశాలలు, బస్టాండ్లు, షాపింగ్‌మాల్స్, కూరగాయల మార్కెట్లు, వ్యాపార సముదాయాల వద్ద పార్కింగ్ చేసి హ్యాండిల్ లాక్ చేస్తున్నా దొంగలు వాటిని చాకచక్యంగా లాక్ తొలగించి వాహనాలను ఎత్తుకెళ్తున్నారు. చోరీ చేసిన ద్విచక్రవాహనాలను విడిభాగాలుగా చేసి విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
సీసీ కెమెరాలున్నా.. పట్టుబడని దొంగలు
జిల్లావ్యాప్తంగా షాపింగ్‌మాల్స్, కళాశాలల వద్ద సీసీకెమెరాలు ఉన్నా దొంగతనం చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నా పోలీసులకు పట్టుబడటం లేదు. పోలీసులకు ద్విచక్ర వాహనదారులను పట్టుకోవడం సవాల్‌గా మారింది.
వారం క్రితం జగిత్యాల పట్టణానికి చెందిన భీమయ్య కొత్తబస్టాండ్‌లో బైక్‌ను పార్క్ చేసి బయటకు వచ్చే సరికి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు.
గత నెల 27న ధర్మపురి పట్టణానికి చెందిన శ్రీనివాస్ తన ఇంటి ముందు ద్విచక్రవాహనం పార్క్ చేసి కొద్దిసేపటి తర్వాత వచ్చి చూసేసరికి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు.
జగిత్యాల పట్టణానికి చెందిన ఓ న్యాయవాది గతనెల 24న మినీస్టేడియం ముందు పార్క్ చేసి వాకింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తుతెలియని దొంగలు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు.


