విజిట్ వీసాపై వెళ్లి
ఏజెంట్ మోసంతో తిరుగుముఖం
జగిత్యాలక్రైం: ఉన్న ఊరులో ఉపాధి లేక విదేశాలకు వెళ్లి ఎంతోకొంత సంపాదించుకోవాలన్న వారి కోరిక ఏజెంట్ల మోసాలతో ఎడారిగా మారింది. రూ.లక్షలు పెట్టి మోసపోయి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయిల్‌లో పని కల్పిస్తామని కొంతమంది ఏజెంట్లు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన వందలాది మంది నిరుద్యోగుల నుంచి నెల రోజుల క్రితం పాస్‌పోర్టులు తీసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 నుంచి రూ.9 లక్షల వరకు వసూలు చేశారు. కొంతమంది ఏజెంట్లు ముందే డబ్బులు తీసుకున్నారు.
ఇజ్రాయిల్ నుంచి 60 మంది తిరిగిరాక
ఏజెంట్లు వీరికి ఇజ్రాయిల్‌లో ఎంప్లాయిమెంట్ వీసా కల్పిస్తామని నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి 60 మందికి విజిట్ వీసాలు ఇచ్చారు. వీరంతా నెల క్రితం ముంబయ్ ఎయిర్‌పోర్టు నుంచి జోర్డన్ వెళ్లారు. అక్కడి నుంచి బస్సులో టెల్‌అవివ్ నగరానికి చేరుకుని ఓ హోటల్‌లో బస చేశారు.
గైడ్ నిఘాతో వాపస్ వచ్చిన కార్మికులు
అక్కడకు వెళ్లగానే కంపెనీ వారు వచ్చి టెల్‌అవివ్ హోటల్ నుంచి తీసుకెళ్లి ఉద్యోగం చూపిస్తారని ఇక్కడి ఏజెంట్లు చెప్పారు. రోజులు గడుస్తున్నా.. ఎవరూ రాకపోవడంతో హోటల్ నుంచి బయటకు రాగా.. అక్కడి గైడ్ గమనించి హోటల్ యజమానులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడి పోలీసులు వీరందరికీ పట్టుకుని తిరిగి ముంబయ్‌కి పంపించారు. స్వగ్రామానికి చేరుకున్న వీరంతా తమ డబ్బులు తమకు చెల్లించాలని ఏజెంట్లపై ఒత్తిడి పెంచారు. అప్పటినుంచి ఏజెంట్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు సమాచారం.


